NTV Telugu Site icon

Kodali Nani: ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్‌కు లేదు..

Kodali Nani

Kodali Nani

Kodali Nani: త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని.. ఇంత మంచి చేసినా ఓటమి పాలవడం నమ్మశక్యంగా లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. 1500 మహిళలకు ఫించన్, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అంశాల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ నెల ఒకటో తేదీన అమలు చేస్తారా లేదా ఇప్పటికే క్లారిటీ లేదన్నారు. పోలవరం, అమరావతి పేరుతో హామీలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read Also: CM Chandrababu: 5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. టీడీపీ బెదిరింపులకు ఎవరు భయపడడం లేదని.. ఎన్నికల కౌంటింగ్ ముగిసి రోజులు కూడా గడవక ముందే జగన్ ఇంటి దగ్గర భద్రత లేకుండా చేశారని మండిపడ్డారు. నన్ను టార్గెట్ చేసి నాకేం అయినా వైసీపీకి ఏం అవ్వదన్నారు. రుషికొండ భవనాలపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న కొడాలి నాని.. జగన్ సొంత భవనాల్లో మాత్రమే ఉంటారు తప్ప ప్రభుత్వ భవనాల్లో ఉండరన్నారు. జగన్‌కు ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ లేదన్నారు. రుషికొండ భవనాల్లో జగన్ ఉంటారు అని ఎవరు చెప్పారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుషికొండ భవనాలు కేవలం టూరిజం శాఖ కోసం మాత్రమే నిర్మించారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వచ్చే వారి కోసం మాత్రమే వీటిని నిర్మించారన్నారు. కోడెల అసెంబ్లీలో ఉండే ఫర్నీచర్‌ను బైక్ షోరూమ్ లో పెడితే దొంగ అన్నారని.. ఫర్నీచర్ ఎంత వ్యయం అని చెబితే చెల్లిస్తారు, లేకపోతే తీసుకు వెళ్లిపోండని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సూపర్‌ సిక్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే నియోజకవర్గాలలో పర్యటన ఉంటుందని కొడాలి నాని వెల్లడించారు.