సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు తెర వెనుక రాజకీయాలు నడిపించిన ఆమె.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. జార్ఖండ్‌లో గాండే అసెంబ్లీ నియోజకర్గం ఖాళీ అయింది. ఈ అసెంబ్లీ స్థానానికి మే 20న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అధికార జేఎంఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. దీంతో ఆమె బైపోల్ ఎన్నిక ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
గాండే నియోజకవర్గ ఎమ్మెల్యే సర్పరాజ్ అహ్మద్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. డిసెంబర్ 31, 2023 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. తాజాగా దీనికి బైపోల్ ఎలక్షన్ కోసం ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. జేఎంఎం నుంచి కల్పనా సోరెన్ బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి దిలీప్ కుమార్ వర్మ పోటీ చేస్తున్నారు. మే 20న ఇక్కడ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Raebareli: రాయ్‌బరేలీ పోరులో వరుణ్ గాంధీ.. బీజేపీ ప్రతిపాదన తిరస్కరణ..
ఇదిలా ఉంటే మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లే తరుణంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన స్థానంలో భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. కానీ చివరిలో రివర్స్ కొట్టింది. ఆమె తోటి కోడలు సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. హేమంత్ సోరెన్ స్థానంలో చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: T20 WC Squad: ఈయన ఎంపిక చేసిన టీ20 వరల్డ్ కప్ భారత జట్టు ఇదే..! అసలు వాళ్లేరి..?
ఇదిలా ఉంటే ఇటీవల ఇండియా కూటమి ఢిల్లీలో చేపట్టిన మహార్యాలీ కార్యక్రమంలో కల్పనా సోరెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర వైఖరిపై ధ్వజమెత్తారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను.. సోనియాగాంధీని కల్పనా సోరెన్ కలిశారు.