బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీకి రానున్నారు. 9:30 నిమిషాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సూచించారు. ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరుకావాలని సూచించారు. అరగంట ముందుగా 9:30 కే అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఎల్పీలో సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల్లో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.
READ MORE: MK Stalin: రూ. 10,000 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. ‘‘ఎన్‌ఈపీ’’పై స్టాలిన్..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. “హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి సుదీర్ఘంగా వివరించాలి. పదేళ్లలో బీఆర్ఎస్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే… కాంగ్రెస్ 14 నెలల్లోనే లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసింది. అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయడం లేదు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగ్స్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలి. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రజా సమస్యలు ఎండగట్టాలి. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలి..” అని మాజీ సీఎం కేసీఆర్ సమావేశంలో తెలిపారు.