తెలుగు రాష్ట్రాల్లో పులులు, చిరుతల సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పల్నాడు అటవీ ప్రాంతంలో కొనసాగుతుంది ఆపరేషన్ టైగర్స్. వెల్దుర్తి, దుర్గి ,కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లో కొనసాగుతున్న టైగర్ సెర్చ్ ఆపరేషన్.. టైగర్ సెర్చ్ కోసం మాచర్లలోనే మకాం వేశారు పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారులు. కండ్రిక ,కనుమల చెరువు ,కాకిరాల అడి గొప్పల, లోయపల్లి గ్రామాలలో 100 కిలో మీటర్ల పరిధి అటవీ ప్రాంతంలో కొనసాగుతుంది అన్వేషణ. టైగర్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి 20 బృందాలు. పులుల జాడ కోసం అటవీ ప్రాంతంలో అత్యాధునిక కెమెరాలను అమర్చుతున్నారు ఫారెస్ట్ అధికారులు. రెండు, మూడు రోజుల్లో పులుల జాడ కనుగొంటామని అంటున్నారు అటవీ శాఖ అధికారులు.
Read Also:Tim Cook: ఆపిల్ లేఆఫ్స్‌పై సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు..
గత కొంతకాలంగా పల్నాడు జిల్లాలోని నల్లమల రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు పెద్ద పులుల సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇటీవల దుర్గి మండలం కాకిరాల, అడిగొప్పుల అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై పులులు దాడి చేసి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలంలో జనం ఆందోళనకు గురవుతున్నారు. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని శివారు పల్లెల్లో పులి సంచారం అలజడి రేపుతోంది. పల్నాడులోని లోయపల్లి, గజాపురంతోపాటు వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో వ్యాఘ్రాలు ఆహారం, నీటి కోసం పొలాలు, వాగుల వెంబడి బయట సంచరిస్తున్నాయి.
దీంతో పశువులు, జీవాలు వీటి బారినపడి అసువులు బాస్తున్నాయి. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 75 వరకు పులులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 26న దుర్గి మండలం గజాపురం సమీపంలో ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. పాదముద్రలను బట్టి పులేనని అటవీ అధికారులు నిర్ధారణ చేశారు. వెల్దుర్తి మండలం లోయపల్లి ప్రాంతంలో జీవాలు, పశువులపై పలుమార్లు దాడి చేసినట్లు- కాపర్లు, అధికారులు చెబుతున్నారు.
పల్నాడు అటవీశాఖ పరిధిలో 44 వరకు బీట్లు ఉన్నాయి. ఇటీవల పులుల సంచారం పెరగడంతో ఆయా ప్రాంతాల్లోని అటవీ అధికారులు స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా పులులు తమ పరిధిని 25 నుంచి 50 కిలోమీటర్లు విస్తరించుకుంటాయి. అందులోకి ఇతర జంతువులు విహరిస్తే అవి సహించవు. ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం వాటి పరిధి నుంచి బయటకు వస్తాయి. ఆహారం, నీటి కోసం గ్రామాల వైపు వస్తాయి. ఇలా వచ్చిన పులులు కొన్ని రోజులు విహరించి అడవుల్లోకి వెళుతుంటాయని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో రామచంద్రారావు తెలిపారు.
Read Also: Mobile Phones: ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతున్నారా..? అయితే మీరు హైబీపీ బారిన పడొచ్చు..