Focus: ఒక్కటంటే ఒక్క ఫోటోతో ఎన్నో అలజడులు సృష్టించవచ్చు. ఫొటోలో ఉండేది తమ ముఖమే అయినా… కనిపించేది తామే అయినా స్మార్ట్‌ఫోన్ కెమెరాని తెగవాడేస్తున్నారు. క్లిక్‌ల మీద క్లిక్‌లతో జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. బెస్ట్‌గా వచ్చిన ఫొటోలను వాట్సాప్ డీపీలుగా, ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకుని మురిసిపోతారు. కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ని విచ్చలవిడిగా వాడేశారు. ఇప్పుడు దాని హవా కాస్త తగ్గి… ఇన్‌స్టా గ్రామ్ కాలం నడుస్తోంది. కేవలం ఫొటోలు, రీల్స్ షేర్ చేయడానికి మాత్రమే అన్నట్టుగా ఉంటుంది ఇన్‌స్టాగ్రామ్. సోషల్ మీడియాలో ఫొటోలు, వ్యక్తిగత వివరాలు పెట్టడమంటే… మన గుట్టును మనమే బజారులో పెట్టడం అన్నమాట. ఫొటోలను చాలామంది చూసి వదిలేస్తే… కొందరు కామెంట్స్, లైక్స్ రూపంలో అభినందిస్తారు. కానీ లక్షల్లో ఒకడుంటాడు. వాడే సైబర్ నేరగాడు. మీ అందమైన ఫొటోలే వాడికి ఆదాయ వనరు. ముఖ్యంగా మహిళల ఫొటోలు.
ఫొటోలను ఏం చేసుకుంటారనే ప్రశ్నే వద్దు. ఏమైనా చేయొచ్చు. స్క్రీన్ సేవర్స్, వెబ్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాడ్స్, మ్యూజిక్ వీడియోల్లో… మార్ఫింగ్‌ని వాడటం సర్వ సాధారణం. సినిమాలు, సీరియల్స్‌లో మార్ఫింగ్‌ని ఎక్కువగా వాడుతుంటారు. ఇలా చేయడానికి పెద్ద ఖర్చు కూడా కాదు. ఇప్పుడిదే మార్ఫింగ్… ఆకతాయిలకు, సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది. మార్ఫింగ్ పుణ్యమా అని సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బలై పోతున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను చీట్ చేస్తున్నారు. వారి నుంచి డబ్బు దండుకుంటున్నారు. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి దిగిన ఫొటోను అందరిలానే వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్ల చేతికి అడ్డంగా చిక్కాడు. వాట్సాప్ డీపీ నుంచి ఆ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకున్న సైబర్ కేటుగాళ్లు అందులోని భార్య ఫొటోను మార్ఫింగ్ చేశారు. న్యూడ్ ఫొటోగా మార్చారు. ఆ తర్వాత దాన్ని భర్త ఫోన్‌కు పంపారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ ఈ ఫొటోలు పంపిస్తామని అతడిని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఆ వ్యక్తి బిత్తరపోయాడు. తన పరువు పోతుందని భయపడ్డాడు. మరో దారి లేక వారికి డబ్బు పంపాడు. డబ్బు పంపినా కేటుగాళ్ల వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బు పంపాలని డిమాండ్ చేశారు. వారి వేధింపులు భరించలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ఘటనలు సమాజంలో తరచూ జరుగుతున్నాయి.
సమాజంలో గౌరవనీయమైన స్థానంలో ఉన్న వాళ్లను అశ్లీలంగా అసభ్యంగా చిత్రించడంతో వీటి వల్ల వాళ్ల పరువు గంగలో కలుస్తోంది. పరువు వరకు అయితే పర్లేదు.. ఈ మహమ్మారి వల్ల ఇప్పుడేకంగా ప్రాణాలే పోతున్నాయి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా నల్లగొండ జిల్లాలో సైబర్ కేటుగాళ్ల వేధింపులు భరించలేక ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం నక్కలపల్లికి చెందిన శివాని, అమ్మనబోలుకు చెందిన మనీషాలు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఇంటర్ నుంచి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. నల్లగొండలోని ఎస్సీ హాస్టల్లో ఉంటున్నారు. గత నెలలో శివాని, మనీషాలు బోనాల పండుగ ఉండడంతో సొంతూళ్లకు వెళ్లారు. సెలవుల తర్వాత ఈనెల 5న కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఇద్దరు వేరువేరుగా తమ ఊళ్ల నుంచి బయలుదేరి నార్కట్‌పల్లికి చేరుకున్నారు. అక్కడ్నుంచి ఇద్దరు కలిసి నల్లగొండకు బయలుదేరారు. నల్లగొండలోని గడియారం సెంటర్‌లో బస్సు దిగారు. అక్కడి నుండి ప్రకాశం బజార్‌లో ఉన్న ఎరువుల దుకాణానికి వెళ్లి… అక్కడ గడ్డి మందు కొనుగోలు చేశారు. దగ్గరలోనే ఉన్న మెడికల్ షాప్‌లో నిద్ర మాత్రలు కూడా కొనుగోలు చేశారు. అక్కడనుండి నడుచుకుంటూ ఎన్‌జీ కాలేజ్ వెనక ఉన్న రాజీవ్ పార్క్‌లోకి వెళ్లారు. అక్కడే గడ్డి మందు తాగారు. రాజీవ్ పార్క్ బయటకు వచ్చిన మనీషా, శివానీలు పార్క్ సమీపంలో అపస్మారక స్థితిలో పడి పోయారు. వారిద్దరిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థులు ఎక్కువ మోతాదులో గడ్డి మందు తాగడంతో పరిస్థితి విషమించింది. 6న ఉదయం చికిత్స పొందుతూ ఇద్దరు స్నేహితురాళ్లు ప్రాణాలు విడిచారు.
శివానీ, మనీషాల ఆత్మహత్యలకు కారణం బ్లాక్‌మెయిలింగ్. వారిద్దరూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలోనే మెజిస్ట్రేట్ వాంగ్మూలం సేకరించారు. వాంగ్మూలం తీసుకునే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ వ్యవహారమే కారణమని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తమ డీపీని ఎవరో మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఓ వ్యక్తి తమను బెదిరిస్తున్నట్లు, బ్లాక్ మెయిల్ చేసి…. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పింది శివాని. వారిని బ్లాక్‌మెయిల్ చేసిన ఆకతాయి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడట. అందుకే తాము విషం తాగినట్లు చెప్పడంతో… శివాని చెప్పిన మాటలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. శివానీ ఒక్కతే ఇన్‌స్టాగ్రామ్ వాడుతోంది. ఇన్‌స్టాలో మనీషా, శివానీ కలిసి ఉన్న ఫొటోనీ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. ఆ పిక్‌ను ఎవరు మార్ఫింగ్ చేశారు..? ఇద్దరు స్నేహితులను ఎవరు, ఎందుకు భయపెట్టారు..? మనీషా, శివానీలు కచ్చితంగా చనిపోవాలని నిర్ణయం తీసుకునేంతగా వారిని భయపెట్టి అంశం ఎంటీ..? అనేది ఇంకా తేలాల్సి ఉంది.
సోషల్ మీడియా అడ్డాగా పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు వాట్సాప్‌ను తమ ఆగడాలకు అవకాశంగా మార్చుకున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. పోకిరీల చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్ అమాయక అమ్మాయిలు, మహిళల పాలిట శాపంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలను సైబర్ కేటుగాళ్లు మార్ఫింగ్ చేస్తున్నారు. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక నల్లగొండలో ఇద్దరు డిగ్రీ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే ఈ మార్ఫింగ్ మాయలు కొత్తేమీ కాదు. కాకపోతే టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది… యాప్స్ విపరీతంగా అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో పని మరింత ఈజీ అవుతోంది. అందుకే వాట్సాప్ డీపీ పెట్టినా, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫొటోలు షేర్ చేసినా… జాగ్రత్తగా ఉండాల్సిందే. సైబర్ కేటుగాళ్లు చిత్రవిచితంగ్రా మాయలు చేస్తున్నారు. పూర్తి స్టోరీ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..