Bank Loans : అవసరం మేరకు తరచుగా ప్రజలు లోన్స్ తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి దీని కోసం కూడా అనేక రకాల ఉత్పత్తులు ఆర్థిక మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వ్యక్తిగత అవసరాల కోసం రుణం తీసుకోవాలనుకుంటే, మీకు పర్సనల్ లోన్ మాత్రమే కాకుండా మీ ఆర్థిక అవసరాలను తీర్చగల అనేక ఇతర ఆర్థిక ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం, ఫ్లెక్సీ లోన్, పర్సనల్ లోన్ వంటి కొన్ని సౌకర్యాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోవడం వల్ల మీరు సరైన ఆర్థిక ఉత్పత్తిని ఎంచుకోవడం సులభం అవుతుంది.
ఓవర్‌డ్రాఫ్ట్ అంటే ఏమిటి?
మీ ఖాతాలో డబ్బు లేనప్పుడు ఆర్థిక అవసరాల కోసం మీకు డబ్బు అవసరమైతే, మీరు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇందులో మీ ఖాతాలో డబ్బు లేనప్పుడు కూడా మీరు డబ్బు తీసుకోవచ్చు. ఓవర్‌డ్రాఫ్ట్ అంటే బ్యాంక్ మీ కోసం ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని సెట్ చేస్తుంది. దీనిలో మీరు నిర్ణీత పరిమితి వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా నుండి విత్‌డ్రా చేసిన మొత్తానికి బ్యాంక్ వడ్డీని వసూలు చేస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌లో మీకు కావలసినప్పుడు డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని బ్యాంక్ మీకు అందిస్తుంది. మీ సౌలభ్యం ప్రకారం మీకు కావలసినప్పుడు తిరిగి చెల్లించవచ్చు. బ్యాంక్ సెట్ చేసిన ప్రీ-అప్రూవ్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిలో ఉంటూనే మీరు బ్యాంక్ నుండి డబ్బు పొందవచ్చు. ఇది మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన క్రెడిట్ సౌకర్యం.
ఈ డ్రాప్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అంటే ఏమిటి?
పేరుకు తగ్గట్లే ఇది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం. దీనిలో ప్రారంభంలో నిర్ణయించబడిన మొత్తం క్రెడిట్ పరిమితి ప్రతి నెల క్రమంగా తగ్గుతుంది. మీ స్థిర పదవీకాలం ముగిసిన తర్వాత క్రమంగా ఈ క్రెడిట్ పరిమితి సున్నా అవుతుంది. డ్రాప్‌లైన్ సదుపాయంలో ప్రిన్సిపల్ మొత్తం ఎప్పటికప్పుడు తగ్గుతుంది. మీరు డ్రాప్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందిన బ్యాంక్ లేదా NBFC ఈ క్రెడిట్ మొత్తాన్ని దాని పాలసీ ప్రకారం నెలవారీగా, త్రైమాసికంలో, ఆరు నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన తగ్గిస్తుంది.
ఉదాహరణతో అర్థం చేసుకోండి
మీరు వార్షిక డ్రాప్‌లైన్ ప్లాన్ కింద మూడేళ్ల కాలవ్యవధితో రూ. 6 లక్షల ప్రారంభ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని తీసుకున్నారని అనుకుందాం. మీరు ఈ 6 లక్షల రూపాయలను ఏడాది ముగిసేలోపు ఒకేసారి లేదా అనేక వాయిదాలలో విత్‌డ్రా చేసుకోవచ్చు. డ్రాప్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ ప్లాన్‌లో, క్రెడిట్ పరిమితి మొదటి సంవత్సరం తర్వాత రూ. 4 లక్షలకు, 2 సంవత్సరాల తర్వాత రూ. 2 లక్షలకు తగ్గుతుంది. 3 సంవత్సరాల తర్వాత మీ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా సున్నాకి తగ్గుతుంది. దీనిని టర్మ్ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం మిక్స్ డ్ ప్లాన్ గా పరిగణించవచ్చు.
పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
పర్సనల్ లోన్ అనేది ఒక రకమైన టర్మ్ లోన్, ఇది రీపేమెంట్ ఆప్షన్‌తో ఈఎంఐగా తిరిగి చెల్లించాలి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కొన్ని నిర్దిష్ట కారణాల వల్ల మీకు ఏకమొత్తాన్ని జారీ చేస్తాయి. రుణగ్రహీత మొత్తం రుణ మొత్తాన్ని ముందస్తుగా పొంది వాయిదాలలో తిరిగి చెల్లిస్తారు.
ఫ్లెక్సీ లోన్ అంటే ఏమిటి ?
ఇది ఒక రకమైన పర్సనల్ లోన్. దీనిలో NBFC లేదా బ్యాంక్ కస్టమర్‌కు ముందస్తుగా ఆమోదించబడిన రుణాన్ని ఇచ్చి అతని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. కస్టమర్ అవసరమైనప్పుడు.. దానిని ఉపయోగించవచ్చు. బ్యాంక్/NBFC నుండి పొందిన క్రెడిట్ పరిమితి కంటే ఎక్కువ మొత్తాన్ని ఖాతా నుండి విత్‌డ్రా చేయగల ఒక రకమైన ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అని కూడా దీనిని పిలుస్తారు. కస్టమర్‌లు తమ సౌలభ్యం మేరకు ఈ లోన్‌ను కూడా ముందస్తుగా చెల్లించవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే, మీ ఫ్లెక్సీ లోన్ ఖాతా నుండి విత్‌డ్రా చేయబడిన మొత్తానికి మాత్రమే వడ్డీ ఛార్జ్ చేయబడుతుంది. మిగిలిన మొత్తానికి వడ్డీ విధించబడదు.
ఫ్లెక్సీ లోన్, ఓవర్‌డ్రాఫ్ట్, పర్సనల్ లోన్ మధ్య ఏది ఉత్తమం ?
ఫ్లెక్సీ లోన్ తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటుంది. సులభంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును విత్‌డ్రా చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఫిక్స్‌డ్ ప్రీ-పేమెంట్ ఆప్షన్ ఉంది. కాబట్టి సమీప భవిష్యత్తులో మీకు డబ్బు కనిపించకపోతే మీరు ఈ ఎంపికను ఎంచుకోవచ్చు. అడపాదడపా నగదు ప్రవాహం ఉండే అవకాశం ఉన్న వారికి ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం మంచిది. వారు కోరుకున్నప్పుడు క్రెడిట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. గృహ పునరుద్ధరణ, వైద్య ఖర్చులు, ప్రయాణం వంటి నిర్దిష్ట అవసరాల కోసం మాత్రమే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి. ఈ లోన్ మొత్తాన్ని రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగించవచ్చు. పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.