పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బర్ధమాన్-దుర్గాపూర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. వాయనాడ్‌లో ఓటమి భయంతో షెహజాదే ( రాహుల్ గాంధీ) తన కోసం మరో స్థానాన్ని ఎంపిక చేసుకుంటారని నేను ముందే చెప్పానన్నారు. ఇప్పుడు అమేథీ నుంచి పారిపోయి రాయ్‌బరేలీ స్థానాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి తక్కువ స్థానాలను మాత్రమే గెలుస్తుందన్నారు. వీళ్లు ఎన్నికల్లో గెలవడానికి పాకులాడడం లేదు.. కేవలం దేశాన్ని విభజించేందుకు ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.
Read Also: Prajwal revanna: ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్.. కర్ణాటక పోలీసులు ఏం చేశారంటే..!
కాగా, బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసిందని ప్రధాని మోడీ ఆరోపణలు చేశారు. జై శ్రీరామ్ నినాదం కూడా వారికి కోపం తెప్పించేలా చేసిందన్నారు. సందేశ్ ఖలీలోని దళితులపై జరిగన దౌర్జన్యాలను టీఎంసి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నారు. దోషి షాజహాన్ ను కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. ఇక, నేను 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి పుట్టాను.. అందుకే ప్రజలు నా వైపు ఉన్నారంటూ మోడీ చెప్పుకొచ్చారు.