FBI ABSCAM 1980: నిజంగా ఈ రోజుల్లో వచ్చిన సినిమాలను తలదన్నేలా ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ఎఫ్‌బీఐ ఉచ్చు పన్నింది తెలుసా! ఎవరి కోసం అనుకుంటున్నారు.. సొంత దేశాన్ని కాసులకు కక్కురుత్తిపడి అమ్మడానికి కూడా వెనకాడని వారి కోసం. ఒకప్పుడు అమెరికన్ రాజకీయాల్లో అవినీతి ఎంతగా పాతుకుపోయిందంటే, చట్టసభ సభ్యులు, సెనేటర్లు డబ్బు కోసం దేశాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటే ఊహించుకోండి. వీళ్ల ఆగడాలను అరికట్టడానికి 1980లలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) “ABSCAM ” అనే ఉచ్చును బిగించింది. ఈ ఉచ్చులో అవినీతి తిమ్మింగలాలు ఎలా పడ్డాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అరబ్ షేక్‌ల వేషంలో ఎఫ్‌బీఐ ఏజెంట్లు ..
1970ల చివరి నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో వ్యవస్థీకృత నేరాలు, అవినీతిపరులు బాగా పేరుకుపోయారు. ఆ సమయంలో సీనియర్ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు బిలియనీర్లు, నేరస్థులకు సహాయం చేయడానికి లంచాలు తీసుకుంటున్నారని FBIకి నిత్యం అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక వాళ్లు అవినీతిపరుల కథను ముగించడానికి డిసైడ్ అయ్యి ABSCAM అనే ఆపరేషన్‌ను ప్రారంభించారు. “AB” అంటే అరబ్‌ను, “SCAM” అనేది మోసాన్ని సూచిస్తుంది. ఇది అరబ్ పెట్టుబడిదారుల పేరుతో రాజకీయ నాయకులను వలలో వేసుకోవడానికి రూపొందించిన ఎఫ్‌బీఐ ఉచ్చు.
FBI ఏజెంట్లు మారువేషంలో ఉండి, అరబ్ దేశాల నుంచి వచ్చిన సంపన్న వ్యాపారవేత్తలు, షేక్‌ల ప్రతినిధులుగా నటించారు. అరబ్ పెట్టుబడిదారులు యునైటెడ్ స్టేట్స్‌లో మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారని, కానీ రాజకీయ, చట్టపరమైన రక్షణ అవసరమని వారు పేర్కొన్నారు. దీనిని సాధించడానికి ఏజెంట్లు రాజకీయ నాయకులు, అధికారులతో సమావేశమై బహిరంగంగా లంచాలు ఇచ్చారు. ఏజెంట్లకు ప్రతిగా, అవినీతిపరులైన రాజకీయనాయకులు”గ్రీన్ కార్డులు”, వ్యాపార లైసెన్సులు, పెట్టుబడిదారులకు చట్టపరమైన రక్షణను హామీ ఇచ్చారు.
ఈ ఆపరేషన్‌లో చాలా మంది ప్రముఖ వ్యక్తులు చిక్కుకున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ఆరుగురు సభ్యులు, ఒక సెనేటర్, ఒక మేయర్ సహా అనేక మంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. FBI రహస్య కెమెరాలు, ఆడియో రికార్డింగ్‌లను ఉపయోగించి ప్రతి సమావేశానికి సంబంధించిన ఆధారాలను ఏజెంట్లు సేకరించారు. ఆశ్చర్యకరంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రమాణం చేసిన నాయకులే కొన్ని వేల డాలర్లకు చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆపరేషన్ వివరాలు ఫిబ్రవరి 2, 1980న ప్రజలకు తెలిసినప్పుడు, అమెరికాలో సంచలనం రేపింది. రాజకీయ నాయకులు లంచాలు తీసుకోవడం, దేశద్రోహులకు వాగ్దానాలు చేయడం వంటివి టెలివిజన్‌లో సాక్షాలతో సహా ప్రసారం అయ్యాయి. ఈ వీడియోలను చూసిన ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిక్కుంది. అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశంలో ఇంత ఉన్నత స్థాయిలో అవినీతిని చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు.
31 మందిలో 19 మంది దోషులు..
ఈ ఆపరేషన్‌లో మొత్తం 31 మంది నిందితులను గుర్తించారు. వారిలో 19 మందిని దోషులుగా నిర్ధారించారు. ఈ ఆపరేషన్‌లో బయటపడిన చాలా మంది రాజకీయ నాయకులకు జైలు శిక్ష విధించారు. ఈ అవినీతి కుంభకోణంలో అత్యంత ప్రముఖ వ్యక్తి సెనేటర్ హారిసన్ విలియమ్స్, లంచం, కుట్ర ఆరోపణలపై దోషిగా తేలారు. న్యూజెర్సీ, ఫిలడెల్ఫియాకు చెందిన అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు కూడా జైలుకు వెళ్లారు. స్వతంత్ర సంస్థలు నిక్కచ్చిగా పని చేస్తే.. ఇలాంటి సంచనాలు నమోదు అవుతాయని ఈ సంస్థ నిరూపించింది.
READ ALSO: Epstein Files: అమెరికన్ రాజకీయాల్లో కొత్త సంచలనం.. ఎప్‌స్టైన్ ఫైళ్లలో ప్రపంచ కుబేరుడి పేరు.. !