Fathers Day : తల్లి మనకు జీవితాన్ని ఇస్తే.. ఆ జీవితానికి సరైన దారిని చూపించేవాడు నాన్న. మనకు ఎలాంటి కష్టం వచ్చినా, ముందుండి ధైర్యం చెప్పి నిలబెట్టేది ఆయనే. అలాంటి తండ్రుల ప్రేమ, త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదే ఫాదర్స్ డే, ఈ ఏడాది జూన్ 15న వచ్చింది. మన నాన్న… నిజమైన శ్రమజీవి. కుటుంబం కోసం తన జీవితాన్ని ధారపోస్తాడు. అలుపెరగని పోరాటం చేస్తాడు. కుటుంబ బాధ్యతలు మోస్తూ, తన జీవితంలోని సంతోషాలను, ఇష్టాలను పక్కన పెట్టి, తన వారి కోసమే ఆలోచిస్తూ బతికేస్తాడు. తన పొట్ట కట్టుకుని, పిల్లల కడుపు నింపడానికి అహర్నిశలు కష్టపడతాడు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో తగిన గుర్తింపు లభించదనిపిస్తుంది. అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తే.. ఆ బిడ్డకు జీవితాంతం భరోసా ఇచ్చేది తండ్రే. అయినా సమాజంలో తల్లికి దక్కినంత ప్రేమ, గుర్తింపు తండ్రికి లేదనిపించడం బాధాకరం.
నాన్నంటే జీవితాన్ని ఇచ్చే దైవం..
అమ్మ మనకు జన్మనిస్తే.. నాన్న మనకు జీవితాన్ని, ఒక దారిని ఇస్తాడు. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే.. నాన్న కష్టాలు మన దరిచేరకుండా కావలి కాస్తాడు. అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే.. నాన్న కష్టాన్ని మాత్రం గుండెల్లో దాచేసుకుంటాడు. అలుపెరగని సైనికుడై, జీవితపు పోరాటంలో అలుపూసలు లేకుండా బతుకుబండిని నడిపిస్తాడు. తన అలసటను కూడా కనిపించనీయకుండా కుటుంబాన్ని పోషిస్తాడు. అలాంటి తండ్రి ప్రేమ, త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా ఫాదర్స్ డే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది (2025) ఫాదర్స్ డే జూన్ 15వ తేదీన వచ్చింది.
ఫాదర్స్ డే చరిత్ర..
ఫాదర్స్ డే జరుపుకోవడం వెనుక ఒక చరిత్ర ఉంది. దీనికి పునాదులు పడింది మొదటగా యునైటెడ్ స్టేట్స్‌లో. 1909లో సొనోరా అనే మహిళ, సెంట్రల్ మెథడిస్ట్ చర్చిలో జరిగిన మదర్స్ డే సెలబ్రేషన్స్‌కి వెళ్తున్నప్పుడు, ఫాదర్స్ డే కూడా జరపాలని ఆమెకు ఒక ఆలోచన వచ్చిందట. సొనోరా తల్లి 16 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ ప్రసిద్ధ కవి, రచయిత, శిల్పి. తనతో కలిపి ఐదుగురు తోబుట్టువులను పెంచడంలో తన తండ్రి పడిన కష్టం, చూపిన ప్రేమను సొనోరా గ్రహించింది.
తండ్రులు కూడా గుర్తింపుకు అర్హులని, వారి త్యాగాలను ప్రశంసించాలని భావించిన సొనోరా.. స్పోకెన్ మినిస్టీరియల్ అసోసియేషన్‌కు ఫాదర్స్ డే ఆలోచనను ప్రతిపాదించింది. అలా మొదటి ఫాదర్స్ డే 1910 జూన్ 19న వాషింగ్టన్‌లోని స్పోకెన్‌లో జరుపుకున్నారు. చాలా సంవత్సరాల కృషి తర్వాత, 1972 నుంచి రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఫాదర్స్ డే అధికారికంగా యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ సెలవుదినంగా గుర్తించబడింది. యునైటెడ్ స్టేట్స్‌లో ఫాదర్స్ డేని గుర్తింపు పొందిన సెలవుదినంగా నిర్వహించుకోవడం వెనుక సొనోరా పాత్ర ఎంతో ఉంది.
తండ్రికి కూతురితో అనుబంధం..
తండ్రికి కొడుకుతో కన్నా కూతురుతో ఉండే అనుబంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా తండ్రికి షేర్ చేయడానికి కొడుకు కొద్దిగా భయపడితే.. కూతురు మాత్రం ధైర్యంగా తన మనసులో మాటను చెప్పగలుగుతుంది. ఎంతో గారాబంగా, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మెట్టినింటికి వెళ్లేటప్పుడు.. తల్లి పైకి వెక్కి వెక్కి ఏడుస్తుంటే, తండ్రి మాత్రం లోలోపల కుమిలిపోతాడు. కొడుకు పట్ల అమితమైన ప్రేమ ఉన్నా.. బాధ్యతలు నేర్పడంలో, క్రమశిక్షణ విషయంలో కాస్త కఠినంగానే ప్రవర్తిస్తాడు తండ్రి. అయినా బిడ్డలంటే తండ్రికి పంచ ప్రాణాలు.
తండ్రి కష్టం గురించి..
నిజంగానే నాన్న కష్టం గురించి మాట్లాడుకుంటే సమాజంలో పెద్దగా చర్చ జరగదు. కుటుంబాన్ని పోషించడం కోసం తండ్రి పడే కష్టం కంటికి కనిపించదు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అంటూ ఒక్కొక్క బాధ్యతల్ని పూర్తి చేసి, వారికి మంచి భవిష్యత్ అందించేదాకా తండ్రి పడే కష్టం మాటల్లో చెప్పలేనిది. ఆడవారితో పోలిస్తే మగవారి జీవితం ఎక్కువగా బయట ప్రపంచంలోనే గడిచిపోతుంది. పిల్లలతో గడపడం, వారితో సంతోషాలు, సరదాలు పంచుకోవడం తక్కువ అనే చెప్పాలి. కుటుంబాన్ని పోషించడానికి రోజంతా శ్రమ పడి వచ్చి, కాసేపు తన బిడ్డలతో గడిపే సమయం అరుదుగా దొరుకుతుంది. తండ్రి అంటే పిల్లలకు ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది. ఆ భయం వెనుక అతను ఇచ్చే భద్రత, నేర్పే క్రమశిక్షణ దాగి ఉంటాయి.
మన జీవితానికి ఓ దారి చూపించిన తండ్రిని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్నప్పుడు మనం అడక్కుండానే మన ఇష్టాలు తెలుసుకుని నెరవేర్చిన తండ్రికి ఏది ఇష్టమో మీరెప్పుడైనా గమనించారా? వారి చిన్న చిన్న ఆనందాలను గుర్తించారా? కనీసం ఈరోజైనా మీ తల్లిదండ్రుల దగ్గర కాస్త సమయం గడపండి. వారితో మీరు పంచుకున్న ఎన్నో అనుభవాలను గుర్తు చేసుకోండి. అందమైన బహుమతులు ఇవ్వండి. అన్నింటి కన్నా ముఖ్యంగా, మీకు మేమున్నామనే భరోసా ఇవ్వండి.
కాలం మారిపోయింది.. రెక్కలొచ్చిన బిడ్డలు తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు. తమ దారి చూసుకుని వెళ్లిపోతున్నారు. ఇదివరకులా పేరెంట్స్ కూడా బిడ్డలను కనడమే కానీ, వారేదో తమని చూస్తారనే భ్రమలు వదిలి వాస్తవంలో జీవిస్తున్నారు. వారికి భవిష్యత్తు ఇచ్చి, తమ అడ్రస్ వృద్ధాశ్రమాలే అని ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు. ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోని బిడ్డలు కొందరైతే.. విదేశాల్లో స్థిరపడిపోయి, పేరెంట్స్‌కి డబ్బులు పంపించి వారి బాధ్యతలు చూసేస్తున్నాం అనుకునే బిడ్డలు ఇంకొందరున్నారు.
చాలామంది ఒంటరైన భార్యాభర్తలు ఉంటారు. లేదా పిల్లలు పంచుకోవడం వల్ల తలో చోట ఉన్నవారు ఉంటారు. వారికున్న పరిస్థితి మనకెదురైతే అనే ఆలోచన చేయండి. ఒంటరిగా ఉన్న మీ తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితం మొత్తం పిల్లల కోసమే కష్టపడి, కనీసం చరమాంకంలో కలిసి బతుకుదామనుకున్న తల్లిదండ్రుల్ని విడదీయకండి. వారి కంట కన్నీరు రాకుండా చూసుకోండి. తాము పస్తులున్నా మనకు తిండిపెట్టి.. బతుకునిచ్చిన తల్లిదండ్రుల్ని బాధ్యతల పేరుతో పంచుకోకండి. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇదే వారికి అందరూ ఇవ్వగలిగిన విలువైన బహుమతి.
ఇక ఫాదర్స్ డే రోజు నాన్నకి ఇష్టమైన పనిచేయడం.. ఇష్టమైన బహుమతి ఇవ్వడం.. ఇష్టమైన ఫుడ్ తినిపించడం.. చేస్తే వారు సంతోషపడతారు. కొడుకులు, కూతుర్లు ఇలాంటి సందర్భాల్లో అయినా తల్లిదండ్రుల దగ్గరకు వస్తే వారి ఆనందం మాటల్లో చెప్పలేం. సెల్ ఫోన్ మెసేజ్‌లలో, వీడియో కాల్స్‌లో పంచే ప్రేమలకు.. ప్రత్యక్షంగా వారిని కలిసి కాసేపు గడిపిన సమయానికి చాలా తేడా ఉంటుంది. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా ఈరోజున (జూన్ 15) వాయిదా వేసుకుని మీ పేరెంట్స్ దగ్గర కాసేపు గడపండి. ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు మీ జీవితానికి కారకులైన తల్లిదండ్రుల్ని ప్రేమించండి. కంటికి రెప్పలా కాపాడుకోండి.