Anantapur: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని దేవస్థానానికి వెళ్తున్నానంటూ ఇద్దరు కూతుర్లు అనసూయ (11), చంద్రమ్మ (9)లను వెంట తీసుకెళ్లిన తండ్రి కొల్లాప్ప, కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర లోలెవల్ (ఎల్‌ఎల్‌సి) కాలువలో వారిని తోసివేసాడు. దానితో కూతుర్లు తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య శిల్పమ్మ భర్త కొల్లాప్పను నిలదీయగా.. గ్రామస్తుల సమక్షంలో అతడు తన కూతుర్లను తుంగభద్ర కాలువలో తోసివేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.
దీంతో గ్రామప పెద్దలు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. కొల్లాప్పను వెంటపెట్టుకుని కర్ణాటక ప్రాంతంలోని తుంగభద్ర లోలెవల్ కాలువలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ గాలింపులో తొమ్మిదేళ్ల బాలిక చంద్రమ్మ మృతదేహం లభ్యమైంది. మరో బాలిక అనసూయ ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న విబేధాల నేపథ్యంలోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.