Another Tear Gas Attack on Farmers: ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉన్న రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. మంగళవారం ఉదయం పంజాబ్-హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మంది రైతులు గాయపడ్డారని తెలుస్తోంది. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధాని లోపలి వెళ్లేందుకు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో రెండు సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు.
రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. యూపీ, పంజాబ్, హర్యానాల నుంచి ఢిల్లీ నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బ్యారికేడ్లను పెట్టారు. మరోవైపు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు వాడే డ్రోన్లకు కూడా ఏర్పాటు చేశారు. ఇక కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు.
Also Read: US Snow Storm: అమెరికాలో మంచు తుపాను.. స్కూల్స్ బంద్, 1200 విమానాలు రద్దు!
దాదాపు రెండేళ్ల తర్వాత పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన రైతులు.. 200కు పైగా సంఘాలతో కలిసి సోమవారం ఢిల్లీ వైపు పాదయాత్రగా బయల్దేరారు. పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సహా 12 డిమాండ్‌లను రైతులు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. రైతు సంఘం నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పంధేర్ నేతృత్వంలోని సంయుక్త్ కిసాన్ మోర్చా మరియు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నిరసనకు పిలుపునిచ్చాయి. వేల మంది రైతులు ఢిల్లీ చలో మార్చ్‌లో పాల్గొన్నారు.