Fake PMO Letter Scam: సైబర్ క్రిమినల్స్ తీరుకు అంతే లేకుండా పోతోంది. ఓ వ్యక్తి.. తాను చీటింగ్ చేయడం కోసం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని వాడుకుంటున్నాడు. ఏకంగా పీఎంఓ అధికారినంటూ లేఖలు పంపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రభుత్వ సంస్థలను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల 2025 మే 1న డాక్టర్ పి. రామారావు పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ లేఖ వచ్చింది. అందులో పి. రామారావు.. తనను తాను న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా పొందుపరిచాడు. ఈవోకు రాసిన ఆ లేఖలో మే 10న తిరుమలలో మూడు ఎసీ డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయించడంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత దర్శనం కల్పించాల’ని కోరారు. ఐతే దీన్ని ధృవీకరించుకునేందుకు టీటీడీ అధికారులు పీఎంఓను సంప్రదించారు. దీంతో పి. రామారావు అనే వ్యక్తి ఎవరూ లేరని తేలింది. పైగా ఈ లెటర్‌ను సీరియస్‌గా తీసుకున్న పీఎంఓ డైరెక్టర్ ఎ.కె శర్మ.. సీబీఐకి ఫిర్యాదు చేశారు.
READ MORE: Gold Rate Today: రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తున్న బంగారం.. ఇవాళ రూ. 1150 పెరిగిన గోల్డ్ ధర
ఇక సీబీఐ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. అదే వ్యక్తి.. అదే మొబైల్ నంబర్ ఉపయోగించి.. ఆగస్టు 21న పూణేలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌ను కూడా సంప్రదించినట్లు గుర్తించారు. వీసీకి రాసిన లేఖలో పీఎంఓ జాయింట్ సెక్రటరీగా పరిచయం చేసుకుని MBA అడ్మిషన్‌ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడు. అంతే కాదు ఆగస్టు 29న మరో నకిలీ లేఖ వెలుగులోకి వచ్చింది. పీఎంఓ జాయింట్ సెక్రటరీ సి.శ్రీధర్ పేరుతో మైసూరు తహసీల్దార్ కార్యాలయానికి లేఖ పంపించి.. భూమి రికార్డులు ఇవ్వాలని అభ్యర్థించాడు. ఈ లేఖలో కూడా అదే మొబైల్ నంబర్ ఉపయోగించినట్లు పీఎంఓ గుర్తించింది.. వరుసగా జరిగిన ఈ ఘటనలపై పీఎంఓ సమర్పించిన ఆధారాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. నిందితునిపై భారతీయ శిక్షాస్మృతిలోని మోసం, ఫోర్జరీ నిబంధనలతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66D కింద కేసు నమోదు చేసింది. ఈ మోసాల వెనుక అతడి ఉద్దేశ్యాన్ని వెలికి తీసేందుకు సీబీఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది..