Fake Call Center: అమెరికా పౌరులే వారి టార్గెట్.. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తారు.. వారిని నిలువునా వణికిస్తారు.. వారిని భయపెట్టి డాలర్లలో డబ్బులు వసూలు చేస్తారు. ఇందుకోసం ఏకంగా ఇండియాలో ఫేక్ కాల్స్ సెంటర్స్ ఓపెన్ చేశారు. మాంచి ఇంగ్లిష్ మాట్లాడే యవతీ యువకులను నియమించుకున్నారు. ఐతే ఈ ఫేక్ కాల్ సెంటర్ల విషయంలో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగడంతో వారి బాగోతం బయటకు వచ్చింది.
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అంతర్జాతీయ మోసగాళ్ల ముఠాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ .. భారీ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్‌లో గతంలో నమోదైన అక్రమ ఫేక్ కాల్ సెంటర్ కేసును ఆధారంగా చేసుకుని.. ఈడీ దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
Illicit Relationship: కోడి కత్తులతో విచక్షణారహితంగా దాడి.. యువకుడి దారుణ హత్య!
అమెరికాకు చెందిన ప్రముఖ క్రెడిట్ కార్డ్ సంస్థలు, ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీల పేర్లు చెప్పి అమెరికా పౌరులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఉద్యోగులను నియమించుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ముఠా సభ్యులు అమెరికా ప్రభుత్వ సంస్థల అధికారులు, ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ అమెరికా పౌరులకు ఫోన్లు చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేదని, ఓవర్‌డ్యూస్ ఉన్నాయని, వెంటనే చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు, శిక్షలు తప్పవని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పన్ను ఎగవేత, రుణ బకాయిల పేరుతో భయపెట్టి అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించి, వాటి కోడ్లను తమకు బదిలీ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆ గిఫ్ట్ కార్డులను క్రిప్టో కరెన్సీగా మార్చి సొమ్ము చేసుకుంటున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఈ అక్రమ వ్యవహారంపై గతంలో సైబరాబాద్ పోలీసులు, ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన కేసులను ఆధారంగా చేసుకుని ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సహా మహారాష్ట్ర, హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. అహ్మదాబాద్‌లోనే మొత్తం ఆరు చోట్ల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Mahabubabad: ఆస్తి కోసం ఉన్మాదిలా.. అత్తమామలపై విద్యుత్ షాక్‌తో దాడి!
ఈ అక్రమ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్న ప్రధాన నిందితులుగా మహ్మద్ అన్సారి, అకిబ్, వికాస్, దివ్యాంగ్ రావల్, ప్రదీప్‌తోపాటు కొంత మంది అనుచరులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. వీరు దేశవ్యాప్తంగా పలు చోట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి.. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. సోదాల సందర్భంగా అకిబ్ వద్ద నుంచి సుమారు 12 వేల అమెరికన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రూ.13.5 లక్షల నగదు, కంప్యూటర్లు, మొబైళ్లు, ఇతర డిజిటల్ పరికరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మోసాల వెనుక ఉన్న కొంతమంది నిందితులు.. విదేశాల్లో ఉన్నట్లు కూడా ఈడీ గుర్తించింది. వారి పాత్రపై అంతర్జాతీయ స్థాయిలో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇలాంటి నకిలీ కాల్ సెంటర్ల ద్వారా అమెరికా పౌరులను మోసం చేస్తుండడం వల్ల … ఈ తరహా నేరాలు దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అంతర్జాతీయ ఆర్థిక నేరాలపై కఠిన చర్యలు తప్పవని, నెట్వర్క్ మొత్తాన్ని ఛేదించే దిశగా విచారణ కొనసాగుతుందని ఈడీ స్పష్టం చేసింది.