చలికాలం కేవలం ఆహ్లాదాన్ని మాత్రమే కాదు, ఆరోగ్య సమస్యలను కూడా వెంటపెట్టుకొస్తుంది. చల్లటి గాలుల ప్రభావంతో వైరల్ వ్యాధులు వేగంగా విజృంభిస్తుంటాయి. జలుబు, దగ్గు, జ్వరం నుంచి మొదలై శ్వాసకోశ ఇబ్బందుల వరకు ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో ప్రతి ఒక్కరికి చలి వేయడం కామన్ కానీ.. పక్కన ఉన్న వారందరికీ మామూలుగానే ఉన్నా, మీకు మాత్రమే వణుకు పుట్టినంత చలి వేస్తోందా? అయితే దాన్ని కేవలం ‘సీజన్’ అని లైట్ తీసుకోవద్దు. అది మీ శరీరంలో ఏదో లోపం ఉందని చెప్పడానికి మీ బాడీ ఇస్తున్న వార్నింగ్. విపరీతమైన చలి వెనుక ఉన్న అసలు కారణాలు మరియు వాటిని అధిగమించే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త ప్రసరణలో లోపం.. విటమిన్ల కొరత:
మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ (Blood Circulation) ఇంజిన్ లాంటిది. అది సరిగా పనిచేయనప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోయి, చర్మం పైపొర కి వేడి అందదు. ముఖ్యంగా గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో లేదా శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి తోడు మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ B12, విటమిన్ D స్థాయిలు పడిపోయినప్పుడు నరాలు బలహీనపడతాయి. దీనివల్ల శరీరం తన ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా వాతావరణంలో స్వల్ప మార్పు వచ్చినా శరీరం త్వరగా చల్లబడుతుంది.
ఆహారమే అసలైన మందు:
చలిని తట్టుకోవాలంటే స్వెటర్లు, బ్లాంకెట్లు మాత్రమే సరిపోవు.. మన లోపలి నుంచి వేడి పుట్టాలి. ఇందుకోసం ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు తప్పనిసరి. అందుకే పాలకూర వంటి ఆకుకూరలు, బీట్‌రూట్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే గుడ్లు, చికెన్, చేపల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. శాఖాహారులు పాలు, పెరుగు, పనీర్ వంటివి తీసుకోవడం ద్వారా విటమిన్ D మరియు కాల్షియం ను పొందవచ్చు. ముఖ్యంగా రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజం పెరిగి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
కేవలం చలిని భరించడం కంటే, సరైన పోషకాహారం తీసుకుంటూ జీవనశైలిని మార్చుకుంటే ఈ సమస్యను సులభంగా జయించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారమే మిమ్మల్ని ఈ చలిలోనూ వెచ్చగా, ఉత్సాహంగా ఉంచుతుంది.