Nava Nandulu: పరమేశ్వరుని వాహనమైన నంది పేరుతో ఏర్పడిన తొమ్మిది పవిత్ర క్షేత్రాలు “నవనందులు”గా పిలవబడుతాయి. ఈ నవనందులు అంతా ఇదివరకు కర్నూలు జిల్లాలో ఉండగా, ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో ఉండటం విశేషం. ఈ నవనందులలో మహానంది ప్రధాన క్షేత్రంగా ఉండగా, దాని చుట్టూ మిగిలిన ఎనిమిది నందులు భక్తుల విశ్వాసానికి నిలయాలుగా నిలుస్తున్నాయి. ఈ నవనందులను కార్తీక మాసంలో దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. మరి ఇంతటి మహిమ కలిగిన నవనందుల గురించి పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..
ప్రథమ నంది:
నవనందుల్లో మొట్టమొదటి నంది ప్రథమ నంది. ఈ నంది నంద్యాల పట్టణంలోని చామకాల్వ ఒడ్డున ఈ ఆలయం ఉంది. సాయంత్రం సమయంలో సూర్య కిరణాలు నంది విగ్రహంపై పడడం ఒక విశేషంగా చెప్పబడుతుంది. సాధారణంగా సాక్షి గణపతి దర్శనంతో ప్రారంభమయ్యే యాత్ర, ప్రథమ నందితో ప్రారంభించబడుతుంది.
నాగ నంది:
ఈ క్షేత్రం నంద్యాల బస్‌స్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంది. స్థలపురాణం ప్రకారం.. నాగులు గరుత్మంతుని భయంతో పరమేశ్వరుని తపస్సు చేసిన ప్రదేశం ఇది. మొదట ఈ ఆలయం నల్లమల అడవిలో ఉండేది. దుర్వినియోగంతో విగ్రహాలు ధ్వంసమయ్యాక, వాటిని తీసుకొచ్చి ఆంజనేయ ఆలయంలో స్థాపించారు.
Pawan Kalyan: యాక్సిడెంట్‌లో జనసేన కార్యకర్త మృతి.. సెల్యూట్ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్..
సోమ నంది:
ఈ నంది నంద్యాల పట్టణం జగజ్జనని ఆలయం సమీపంలో ఉంది ఈ క్షేత్రం. ఈ ప్రదేశం చంద్రుని తపస్సు స్థలంగా చెప్పబడుతుంది. సోముడు అంటే చంద్రుడు కాబట్టి, ఇతడు ఇక్కడ శివునిపై తపస్సు చేశాడని స్థానికులు విశ్వసిస్తారు.
సూర్య నంది:
నంద్యాల నుంచి మహానందికి వెళ్తున్న మార్గంలో బొల్లవరం గ్రామం వద్ద కుడివైపుని మలుపులో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ సూర్య కిరణాలు శివలింగంపై పడుతుండడం ప్రధాన విశేషం. పురాతన కాలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతూ ఈ ఆలయం ధ్వంసమైనట్లు సమాచారం.
శివ నంది (రుద్ర నంది):
నంద్యాల మండలం తిమ్మవరం గ్రామం దాటిన తర్వాత ఎడమవైపు ఉన్న ఈ ఆలయం శివ నందిగా ప్రసిద్ధి. దీనిని రుద్ర నంది అని కూడా పిలుస్తారు. మిగిలిన నందుల ఆలయాల కంటే ఇక్కడి శివలింగం అతి పెద్దది కావడం ప్రత్యేకత.
విష్ణు నంది (కృష్ణ నంది):
మహానంది దగ్గరలో తెలుగు గంగ కెనాల్ పక్కనున్న మట్టి రోడ్డు ద్వారా వెళ్లే మార్గంలో ఉన్న ఈ ఆలయాన్ని విష్ణు నంది లేదా కృష్ణ నందిగా పిలుస్తారు. మహావిష్ణువు ఇక్కడ శివుని ఆరాధించినట్లు స్థలపురాణం చెబుతోంది.
Rishab Shetty: 3 సినిమాలు.. 200 కోట్లు!
గరుడ నంది:
నంద్యాల, మహానంది రూట్లో ఉంది గరుడ నంది ఆలయం. వినతాదేవి చేసిన శివారాధనకు గుర్తుగా స్థాపించబడినదిగా భావించబడుతుంది. గరుత్మంతుని తల్లి వినతాదేవి తపస్సు ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందిన ప్రదేశం ఇది.
మహానంది:
నవనందుల్లో అత్యంత ప్రసిద్ధమైన శైవ క్షేత్రం మహానంది. ఇక్కడ స్వయంభూ లింగం కొలువై ఉంది. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర స్నానకుండం లోతు 5 అడుగులు ఉంటుంది. ఈ నీరు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండటం విశేషం. శివుడు గోవుపాదంలో స్వరూపమున వెలసినట్లు స్థలపురాణం చెబుతుంది.
వినాయక నంది:
ఈ నంది మహానంది ఆలయ దర్శనం పూర్తి అవ్వగానే బయటి వచ్చిన వెంటనే వాయువ్య దిశలో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ వినాయకుడు స్వయంగా శివునిపై తపస్సు చేసి, ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. అందువల్ల దీన్ని వినాయక నందీశ్వర ఆలయంగా పిలుస్తారు.
ఈ నవనందుల దర్శనం ద్వారా పరమశివుని అనుగ్రహం పొందవచ్చని, అలాగే పునర్జన్మలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక మాసంలో యాత్రికులు పెద్దఎత్తున ఈ క్షేత్రాలను సందర్శిస్తారు. కాలినడకన లేదా వాహనాలలో వీటిని రోజులోనే దర్శించుకునే సౌలభ్యం ఉండటం ఈ యాత్రకు మరింత మహత్తును చేకూర్చుతుంది. ఈ నవనందులను కేవలం ఒక్కరోజులో దర్శనం చేసుకోవచ్చు.