NTV Telugu Site icon

Etela Rajender: ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మండిపడిన ఈటల..

Etela

Etela

Etela Rajender: ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలో కూల్చివేతలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపురంలో కూల్చివేతలు అక్రమమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని.. కూల్చిన ఇళ్లకు పరిహారం, బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఈటల పేర్కొన్నారు. ఈ భూముల విషయంలో దమ్ముంటే ప్రభుత్వం విచారణ జరపాలని ఎంపీ సవాల్ విసిరారు. పేద మధ్య తరగతి వారు రూపాయి రూపాయి పోగు చేసి కొనుక్కున్నారని.. అన్ని అనుమతులు తీస్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ కూలగొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్లు కుల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాడు అనుమతులు అధికారులే ఇచ్చారు.. ఈనాడు వచ్చి కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అయినా, రేవంత్ ప్రభుత్వం అయినా పేదలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. గంజాయి అమ్మేవాళ్ళను ఆపే తెలివి లేదు కానీ వందల మంది పోలీసులను వేసుకొని పేదల ఇళ్లు కూలగొట్టడానికి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ ఓడిపోయారన్నారు. ఒళ్లు వంచి కష్టపడి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని.. కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. రెవెన్యూ మంత్రికి తెలియకుండానే రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లు కూల్చారంటూ ఆగ్రహించారు. పేదల మీద దండయాత్ర చేయడమే న్యాయమా అంటూ ప్రశ్నించారు. అందినకాడికి దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారన్నారు. చట్టం మరచి, బాధ్యత మరచి బానిసలుగా పని చేస్తే జైలుపాలు అయిన అధికారులు ఉన్నారన్నారు. అధికారులు సత్యం ప్రకారం పని చేయాలని.. రెవెన్యూ అధికారులకు హెచ్చరిస్తున్నామని.. చట్టానికి అనుగుణంగా పని చేయాలని.. పేదల మీద దౌర్జన్యం చేయొద్దని ఈటల రాజేందర్ సూచించారు.