Ravichandran Ashwin Braks Bhagwat Chandrasekhar Record: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌పై టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా యాష్ రికార్డులకెక్కాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓలీ పోప్‌ను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై అశ్విన్ 96 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఈ రికార్డు భారత మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉంది.
భగవత్ చంద్రశేఖర్ 1964-79 మధ్య ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 95 వికెట్లు పడగొట్టాడు. 45 ఏళ్ల పాటు ఈ రికార్డు చంద్రశేఖర్ పేరుపై ఉండగా.. తాజాగా రవిచంద్రన్ అశ్విన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (92), బిషన్ సింగ్ బేడీ (85), కపిల్ దేవ్ (85), ఇషాంత్ శర్మ (67) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ మరో వికెట్ పడగొడితే.. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు సాధించిన క్లబ్‌లో చేరుతాడు. అశ్విన్ భారత జట్టులో బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2021లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యాష్ సెంచరీ బాదాడు.
Also Read: IND vs ENG: శ్రేయస్ అయ్యర్.. ఇక కష్టమే! మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉప్పల్ టెస్టులో ఆరు వికెట్లు తీసిన ఆర్ అశ్విన్.. వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 12 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన మాయాజాలం చూపాడు. మూడో రోజు బెన్ డకెట్ (28)ను ఔట్ చేసిన అశ్విన్.. నాలుగో రోజు రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. ప్రమాదకరమైన ఓలీ పోప్ (23), జో రూట్ (16)లను యాష్ పెవిలియన్ చేర్చాడు. యాష్ మరో వికెట్ తీయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.