అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో సహా ఐదుగురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్స్ తీయలేకపోయాడు. సిరాజ్, ప్రసిద్, జడేజాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండవ టెస్ట్ కోసం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి.
ఇప్పటికే కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ సెషన్‌లో చెమటోడ్చుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జడేజా, కుల్దీప్‌లు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారని తెలుస్తోంది. రెండో టెస్ట్ నేపథ్యంలో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో కుల్దీప్ మాట్లాడుతూ.. రెండవ టెస్ట్‌లో అవకాశం లభిస్తే అటాకింగ్ బ్రాండ్ స్పిన్ ఆడటంపై దృష్టి సారిస్తా అని స్పష్టం చేశాడు. ‘వికెట్లు తీయకపోతే జట్టులో స్థానాన్ని నిలుపుకోలేరు. ముఖ్యంగా ఇంగ్లండ్‌లో. స్వదేశంలో లేదా విదేశాలలో ఆడుతున్నా.. లక్ష్యం మాత్రం వికెట్లు తీయడమే. గతంలో కెవిన్ పీటర్సన్ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లు, పిచ్‌లు, బ్యాటర్ల గురించి చర్చించాం. చాలా మంది స్పిన్నర్లు డిఫెన్సివ్ మనస్తత్వంతో ఇంగ్లండ్‌కు వస్తారని పీటర్సన్ నాతో చెప్పాడు. పేసర్లు వికెట్స్ తీస్తారని, వారిని మనం మద్దుతు ఇస్తే చాలను స్పిన్నర్లు బావిస్తుంటారన్నాడు. అందుకు భిన్నంగా ఆలోచించమని నాతో చెప్పాడు. 15-20 ఓవర్లు బౌలింగ్ చేస్తే.. ప్రతి బంతికి బ్యాటర్‌ను ఎలా అవుట్ చేయాలో ఆలోచించాలని సూచించాడు’ అని కుల్దీప్ తెలిపాడు.
Also Read: Raja Singh: రాజా సింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి గుడ్‌బై..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెవిన్ పీటర్సన్ మెంటర్‌గా పనిచేసిన సమయంలో కుల్దీప్ యాదవ్ అతనితో విలువైన సమయాన్ని గడిపాడు. ఇంగ్లండ్ పరిస్థితులలో స్పిన్నర్‌గా ఎలా విజయం సాధించాలనే దానిపై పీటర్సన్ కీలక సూచనలు చేశాడు. కుల్దీప్ ఇంగ్లండ్‌పై ఆరు టెస్టుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లీష్ గడ్డపై 2018లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇప్పుడు పీటర్సన్ మార్గదర్శకత్వంలో ప్రభావం చూపాలని ఆశిస్తున్నాడు. జులై 2 నుంచి రెండవ టెస్ట్ ఆరంభం కానుంది. కుల్దీప్ చివరిసారిగా 2024 అక్టోబర్‌లో భారత్ తరపున ఆడాడు.