పవిత్రమైన ఆలయంలో ఉద్యోగం చేస్తూ.. దేవాలయ సరుకులను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నాడు ఓ ఉద్యోగి. దీనికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న ఆలయంలో ముఖ్యమైన విభాగంలో పనిచేస్తున్న ఉన్నత ఉద్యోగి తన విభాగం నుంచి అందినంత సరుకులను తరలిస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న వైనం బయటపడింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కు యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చి పనిచేస్తున్న v. వెంకట ప్రసాద్ ( రాజు) పర్యవేక్షకుడు ప్రస్తుతం బద్దిపోచమ్మ ఆలయం సూపరింటెండ్ గా, నాంపల్లి గుట్ట సూపరింటెండ్ గా, అలాగే ముఖ్య విభాగమైన గోదాం సూపరింటెండ్ గా సైతం పనిచేస్తున్నారు.
Also Read:TG Police: తీవ్ర నేరాలు చేసిన వాళ్ల పైన పౌర సమాజం ఆగ్రహం.. అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్న పోలీసులు
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన దగ్గర పని చేసే లేబర్ ద్వారా గోదాం నుంచి సరుకులు తన సొంత కార్లో (TG 1OC 0841) దర్జాగా తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇది మొదటిసారి కాదని, గోదాం సెక్షన్ కి వచ్చినప్పటి నుంచి తన కింది స్థాయి సిబ్బందిని నయనా, భయానా బెదిరించి సామాన్లు తీసుకెళ్తాడని విమర్శలు ఉన్నాయి. గతంలో యాదగిరిగుట్టలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారని, ప్రస్తుతం వేములవాడకు బదిలీపై వచ్చిన ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయన్న ధీమాతో తాను ఆడింది ఆటగా పాడింది పాటగా మారిందని పలువురు మండిపడుతున్నారు. సదరు ఉద్యోగిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.