దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నదులు, వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో చాలా మంది గల్లంతయ్యారు. బిహార్‌లో వరదలు జనజీవనానన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలాంటి గంగానదిలో చిక్కుకున్న మావటిని దాదాపు 3 కిలోమీటర్లు ఈది రక్షించింది గజరాజు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లా రాఘవాపూర్‌లో జరిగింది.
రాఘవాపూర్‌లో భారీ వర్షాల కారణంగా గంగానది ఉప్పొంగింది. రాఘవాపూర్ దగ్గర గంగానదిలో ఏనుగుతో సహా చిక్కుకుపోయాడు ఓ మావటి. ఏనుగును నది దాటించాలంటే పడవ అవసరం. అయితే అంత డబ్బు లేకపోవడంతో ఏనుగుతో నది దాటే ప్రయత్నం చేశాడు . అయితే ఆకస్మాత్తుగా నదిలో ప్రవాహం పెరిగింది. ఓ చెట్టుకు పట్టుకొని ఏనుగు మీద కూర్చున్నాడు మావటి.. కాసేపటి తరువాత మావటిని క్షేమంగా ఒడ్డుకు చేర్చింది ఆ ఏనుగు. కాగా, వరద నీటి ప్రవాహంలో ఓ ఏనుగు మూడు కిలోమీటర్లు ఈదిన ఘటన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, ఏనుగుతో సహా మావటివాడు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద కారణంగా గంగా నదిలో కొంత దూరం కొట్టుకుపోయారు.
ఈ క్రమంలో తల వరకు మునిగిన ఆ ఏనుగు నదిలో సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది. చివరకు ఒక చోట నది మలుపులో కొందరు వ్యక్తులు ఉండటాన్ని మావటివాడు చూసి ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పందించిన నెటిజన్లు ఏనుగు ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రవాహ వేగంలో కొంచెం పొరపాటు జరిగినా ఏనుగుతో పాటు మావటి కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. చాలా సార్లు ఏనుగు నీటిలో మునిగిపోవడం వీడియోలో కనిపిస్తోంది.