లోక్‌సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, విలువైన వస్తువులు భారీగా పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) రికార్డు స్థాయిలో డబ్బును సీజ్ చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర తాయిలాలను ఈసీ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల ప్రచారంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్లతో పోలిస్తే.. ఈసారి 34 శతం పెరిగింది.
2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం సీజ్ చేసిన వస్తువుల విలువ గణనీయంగా పెరిగింది. నగదు 114 శాతం, మద్యం 61 శాతం, విలువైన లోహలు 43 శాతం పెరిగాయి. మాదకద్రవ్యాల సీజ్‌లు 62 శాతం పెరిగి రూ.2,068 కోట్లకు చేరుకున్నాయి. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో రోజుకు సగటున రూ.100 కోట్లు విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నామని ఈసీ వెల్లడించింది. మొత్తం సీజ్ చేసిన రూ.4,658 కోట్ల విలువైన వాటిలో నగదు రూ.395 కోట్లు కాగా.. మద్యం వాటా రూ.489 కోట్లకు పైగా ఉందని పేర్కొంది.
Also Read: Robert Vadra: రాహుల్ గాంధీ కాదు.. అమేథీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ!
నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో రాజకీయ నేతలకు సహకరిస్తున్న 106 మంది ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకొన్నట్టు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హెలికాప్టర్లో సోదాలు చేయడం కొత్తేం కాదని, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ విషయంలో కూడా అదే జరిగిందని ఈడీ పేర్కొంది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో రాజస్థాన్‌లో అత్యధికంగా రూ.778 కోట్లు, గుజరాత్‌లో రూ.605 కోట్లు, తమిళనాడులో రూ.460 కోట్లను ఈసీ సీజ్ చేసింది. గుజరాత్‌లో రూ.485 కోట్లు, రాజస్థాన్‌లో రూ.533 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. 18వ లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.