ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైసీపీ నాయకులే గొడవలు చేశారు.. టీడీపీ నాయకులు చాలా మంచి వాళ్ళు అనే విధంగా పరిస్థితులను మార్చేస్తున్నారన్నారు. పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో, ఎన్నికలకు మూడు రోజులు ముందుగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని మార్చేశారని తెలిపారు. ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఎక్కువగా నియమించారని ఆరోపించారు.
READ MORE: Viral Video: రోడ్డుపై ఎగ్ ఆమ్లట్ వేసిన మహిళ.. మండిపడుతున్న నెటిజన్లు
ఎన్నికల రోజు వైసీపీ నాయకులు ఫిర్యాదులు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. మాచర్లలో 4 వేలు ఓట్లు ఉన్న బూతుల్లో డీఎస్పీ స్థాయి అధికారులు నియమించారని చెప్పారు. పాలవాయి జంక్షన్లో రిగ్గింగ్ జరుగుతుందన్న మా ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎస్సీ బీసీలను బెదిరిస్తూ దాడులు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల్లో 9 చోట్ల ఈవీఎంలు పగలగొడితే, ఒక్క మాచర్ల ఎంఎల్ఏ రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం విజువల్స్ బయటికి ఎందుకు వచ్చాయన్నారు. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు.
కాగా.. పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా సరే మాచర్లకు వెళ్తామంటూ టీడీపీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మాచర్లకు వెళ్లకుండా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాను గృహనిర్బంధం చేశారు పోలీసులు. ఆయనతో పాటు ముందస్తుగా పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు.