సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అందులో ఉన్న వారితో పాటు…వారిని రక్షించేందుకు…బావిలోకి దిగిన గజ ఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. శాయశక్తుల కష్టపడి.. బావిలో పడిన కారును బయటకు తీసే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. ఆరు గంటలు శ్రమించి… చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన గజ ఈతగాళ్లు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి.
మెదక్ జిల్లా నందిగామకు చెందిన తల్లి భాగ్యలక్ష్మి, కుమారుడు ప్రశాంత్…హుస్నాబాద్‌కు బయల్దేరారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పడంతో.. చిట్టాపూర్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. కారు బావిలో పడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనలో తల్లీ కొడుకులతో పాటు గజ ఈతగాడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులో…జాతీయ రహదారి కల్వర్తు పైనుంచి కారు కింద పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ నయీముద్దీన్, అహ్మద్‌లకు తీవ్ర గాయాలయ్యాయ్. క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు.