ఎంత నిఘా పెట్టినా.. ఎంత కట్టడి చేసినా.. స్మగ్లర్లు తమ దందా సాగిస్తూనే ఉన్నారు. రోజు రోజుకు కొత్త తరహాలో దందా నిర్వహిస్తున్నారు. ఇలాగే చెన్నై ఎయిర్ పోర్టులో ఇద్దరు స్మగ్లర్లు.. ఏకంగా 56 కిలోల కొకైన్‌తో పట్టుబడ్డారు. వారు కొకైన్‌ను తీసుకు రావడానికి ఉపయోగించిన విధానం చూసి కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ స్మగ్లర్లు కొకైన్ ఎలా తీసుకొచ్చారు?ఇక్కడ.. గోల్డ్ కలర్ డబ్బాల్లో ఏముందో తెలుసా? అరె.. ఇదేదో చాక్లెట్ డబ్బాలా ఉందే అనుకుంటున్నారా? అవును అవి చాక్లెట్లే. ఇంటర్నేషనల్‌గా మంచి బ్రాండ్‌గా పేరు పొందిన FERRERO ROCHER బ్రాండ్‌కు చెందిన చాక్లెట్లు అవి. చూడ్డానికే నోరూరిస్తున్నాయి కదా..! అమెరికాలో మాత్రమే దొరికే ఈ చాక్లెట్లను చాలా మంది ఇండియాకు తెప్పించుకుంటూ ఉంటారు.
కానీ ఈ చాక్లెట్ల మాటున కొంత మంది డ్రగ్స్ దందా చేస్తున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో ఈ బాగోతం బయటపడింది. ఈ తియ్యని చాక్లెట్ల డబ్బాలు ఓపెన్ చేస్తే అత్యంత ఖరీదైన కొకైన్ డ్రగ్ బయటపడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 56 కిలోల కొకైన్ డ్రగ్‌ను ఈ చాక్లెట్ల మాటున తరలిస్తున్నారు స్మగ్లర్లు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ దాదాపు రూ. 100 కోట్ల వరకు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
చెన్నై ఎయిర్ పోర్టులో ఇథియోపియా నుంచి ఓ విమానం ల్యాండ్ అయింది. ఓ ఇద్దరు వ్యక్తులు కాస్త అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కస్టమ్స్ అధికారులు వారిపై నిఘా పెట్టారు. చివరకు వారికి చెందిన లగేజీని తనిఖీ చేయడంతో.. ఈ చాక్లెట్లు బయటపడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో చాక్లెట్లు ఎందుకు తీసుకు వస్తున్నారన్న అనుమానంతో బాక్సులను ఓపెన్ చేశారు. దీంతో మొత్తం 56 కిలోల కొకైన్ గుట్టు బయట పడింది. ఇక కొకైన్ తీసుకు వచ్చిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నిజానికి కస్టమ్స్ అధికారులకు డౌట్ వస్తుందని స్మగ్లర్లకు కూడా తెలుసు. కానీ వారికి అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతో కొకైన్‌ను క్యాప్యూల్స్‌లో నింపి గోల్డ్ కవర్స్‌తో ప్యాకింగ్ చేశారు. ఆ తర్వాత చాక్లెట్ బాక్సులలో పెట్టేశారు.
Also Read:Wobble Maximus: అతిపెద్ద స్మార్ట్ టీవీ.. 116.5-అంగుళాల డిస్ప్లేతో.. థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్
చెన్నైలో పట్టుబడ్డ స్మగ్లర్ల వద్ద సమాచారం సేకరించి.. వారితో సంబంధాలు ఉన్న మరికొందరిని కూడా వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నారు. ముంబయిలో ఒకరిని, ఢిల్లీలో మరో నైజీరియా స్మగ్లర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో కొత్త తరహాలో డ్రగ్స్ ఇండియాకి తీసుకొచ్చిన వారి వెనకాల ఎవరు ఉన్నారనే దానిమీద పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.