తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారన్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం పోటులోకి వెళ్లాయా?, ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్తాయని, NABL తర్వాత కూడా టీటీడీ ల్యాబ్లో టెస్టులు కూడా పాస్ కావాలని, ఆ తరువాతే నేయి ట్యాంకర్లను లోపలికి అనుమతిస్తారని చెప్పారు. గతంలో చంద్రబాబు హయాంలో 17 సార్లు, వైసీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారని.. ఇది రొటీన్ ప్రోటోకాల్ పేర్కొన్నారు. ఆ స్థాయిలో పరీక్షలు జరిగాక కల్తీ జరిగిందని ఎలా అంటారు?, చివరకు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.
‘ఇప్పటివరకు ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి మాత్రమే ఇస్తున్నారు. డీఏ అరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామనటం చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రమే చెల్లింది. చరిత్రలో లేని విధంగా జీవోలు ఇవ్వటంతో ఉద్యోగ సంఘాల అభాంతరాలతో ఉపసంహరించుకున్నారు. ఎన్నికల్లో మెరుగైన పీఆర్సీ అన్నారు.. ఇంతవరకు పీఆర్సీ చైర్మన్ ను కూడా నామినేట్ చేయలేదు. మెరుగైన పీఆర్సీ ఒక బూటకం.. ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు.. ఓపీఎస్ కూడా లేదు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, ఇతర రూపాల్లో ఉద్యోగులకు 35 వేల కోట్లు బకాయిలు పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్కాస్ ద్వారా ఒకటవ తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. ఆలయాలల్లో లేబర్ కాంట్రాక్టులు కూడా చంద్రబాబు బందువులు ఇచ్చుకున్నారు. గెస్ట్ లెక్చరర్స్ కు 8 నెలలుగా జీతాలు లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ముందుకు వెళ్తున్నాం. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. గత ప్రభుత్వ హయాంలో ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని తీర్మానం చేసి పంపాం, ప్లాంట్ మైన్స్ ఇవ్వమని కేంద్రాన్ని కోరాం. ఎన్నికల ముందు విశాఖ ఉక్కుపై ఒకలా.. ఇప్పుడు మరోలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాటలు చూస్తే సినిమాల్లో చూసే విలన్ పాత్రకు నిదర్శనం. ఎన్నికల ముందు వీర డైలాగులు చెప్పాడు.. ఇవాళ ప్రశ్నిస్తే పనిచేయకుండా జీతాలు ఇవ్వాలా అంటున్నాడు. తమాషాలు చేయొద్దు.. పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తాం అని బెదిరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు మైన్స్ లేకపోవటమే కారణం. విశాఖ ఉక్కు కంటే సెయిల్ బాగా లాభాల్లో ఉండటానికి ఐరన్ ఓర్ ఉండటమే కారణం. మేం అనేకసార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ మైన్స్ ఇవ్వాలని కోరాం. వాళ్లేమో విశాఖ ప్లాంట్ కు మైన్స్ అడగకుండా ప్రైవేట్ ఆద్వర్యంలో పెడుతున్న కంపెనీకి మైన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు’ అని జగన్ వివరించారు.
‘రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్లే ఉన్నారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్లు పెట్టినవే. పూజలు చేసి మరి కల్తీ మద్యం ఫ్యాక్టరీలు మొదలుపెట్టారు. వీరే తయారు చేస్తారు.. బాటిల్స్ మీద లేబుల్స్ వేస్తున్నారు. వాళ్ళ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు. టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆద్వర్యంలో అంతా నడిపారు. కుటీర పరిశ్రమల తరహాలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలు మొదలుపెట్టారు. కల్తీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది వీళ్ల నాయకులే. ప్రభుత్వం.. పోలీసులు.. తయారీ.. సరఫరా అన్నీ వీళ్ళవే. వీళ్ల రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఎవరికైనా నడిపే దైర్యం ఉందా. ఇంత చేసి మా పార్టీ నేత జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఇంత చేసిన జయచంద్రారెడ్డి అండ్ కో అరెస్ట్ కాలేదు. మొత్తం వీళ్ల కనుసన్నల్లోనే జరిగింది. అన్నీ వీళ్లే చేస్తూ తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలతో మా మాజీమంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఒక మాజీమంత్రి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి. ఒక దొంగే.. దొంగ దొంగ అంటున్నారు. ఆఖరుకు వాళ్ళ కొడుకు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నాడని అతన్ని కూడా కేసులో పెట్టారు. మాచర్ల కు చెందిన మా పార్టీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసులు పెట్టారు. వీళ్ల హయంలో టీడీపీ గ్రూపు తగదాలతో చంపుకుంటే వాళ్ళు ఇరికించింది మా పార్టీ లీడర్ పిన్నెల్లిని. ఘటనకు కారణం టీడీపీ గ్రూపు తగాదాలే కారణం అని సాక్షాత్తు ఎస్పీ కూడా చెప్పారు. చనిపోయిన వాళ్ళు టీడీపీ వాళ్ళు.. చేసింది కూడా టీడీపీ వాళ్ళే.. మా పార్టీ నేతలకు ఏం సంబంధం. ఆ ఎస్పీ ఇష్యూపై ఒక ట్వీట్ కూడా చేశారు. ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు మృతి అని వాళ్ళ పేపర్స్ లో కూడా వచ్చింది. అసలు న్యాయం ఎక్కడుంది.. ఇలాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ ను అడ్డుకున్నందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైళ్లో పెట్టారు. విశాఖలో మా పార్టీ విద్యార్ధి నేత కొండారెడ్డి ఇలాంటి దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. విద్యార్ధి అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టారు. టిఫిన్ చేసేందుకు వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీ ఫుటేజ్ ఉంది. ఎక్కడో అరెస్ట్ చేసి.. ఎక్కడో పట్టుకున్నట్లు చూపించారు. ఒకరి జీవితాన్ని నాశనం చేస్తున్నామన్న గిల్టీ కూడా లేదు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు.. ఆ కేసును నీరుగార్చేందుకు లేని కేసు సృష్టించారు. ఆయనది ప్రైవేట్ మాఫియా.. ప్రైవేట్ కథ. మాది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది. లేని లిక్కర్ కేసు పేరుచెప్పి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్టు చేశారు. ఈ కేసులో డబ్బులు పట్టుకున్నామని చూపించారు. ఆ డబ్బులు ఎప్పటివో చెప్పాలని పిటిషన్ వేయటంతో మిగతా డబ్బులో కలిపేశారు. ఆ డబ్బులు పరిశీలిస్తే అవి ఒక ప్రైవేట్ కాలేజీ డబ్బులు అని తెలిసిపోతాయి అని భయపడ్డారు. అనేకమంది మా పార్టీ నేతలను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణ మురళి, కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారిని కూడా అరెస్ట్ చేశారు. సాలూరులో మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వేధించాడని మండల ఆఫీస్లో పనిచేసే ఒక మహిళ ఉద్యోగి కేసు పెట్టేందుకు వెళ్తే తీసుకోలేదు. అసభ్య పదజాలంతో వేధించినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. అలాంటి వారిని ఏం చేయాలి.. బొక్కలో వేయాలి కదా?’ అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.