వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని, చాలామంది కొట్టుకుపోయారని, రోడ్లు కొట్టుకుపోయాయని, హైవేలు, వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తోందన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. శుక్రవారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగామ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. 5 లక్షల ఎకరాల పంట నీట మునిగిందని, దాదాపు 40 వేల కుటుంబాలు కట్టు బట్టలతో ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు డీకే అరుణ. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం దారుణమని, భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు డీకే అరుణ. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చేతులెత్తేశారని, గత రెండేళ్లుగా వర్షాలకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారని.. అయినా సర్కార్ గుణపాఠం నేర్చుకోలేదన్నారు.
Also Read : Online Love Story: ప్రియుడిని పెళ్లాడేందుకు చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దు దాటిన మరో ప్రియురాలు
వరంగల్ లో నీళ్లు ఉన్నాయా? నీళ్లలో వరంగల్ ఉందా..? అనే అనుమానం కలుగుతోందని, వరంగల్ లోనే దాదాపు 150 కాలనీలు నీట మునిగాయన్నారు డీకే అరుణ. గతంలో నీట మునిగిన ఇండ్లకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి కూడా కేవలం ఎలక్షన్ ఉందనే కారణంగా రూ.10 వేలు ఇచ్చారని ఆమె అన్నారు. మరి ఇప్పుడు అంతకంటే భారీ వర్షంతో ఇండ్లు నీట మునిగాయని, ఇప్పుడు ఎందుకు కేసీఆర్.. రూ.10 వేలు ఇవ్వడం లేదని ఆమె వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా సమీక్ష నిర్వహించి ఎంత పంట నష్టపోయింది, ఎన్ని ఇండ్లు మునిగాయి, ఎందరు చనిపోయారు, ఎందరు గల్లంతయ్యారు అనే వివరాలు తెలిసుకుని సహాయం చేయాలన్నారు. డల్లాస్ చేస్తానని చెప్పి హైదరాబాద్ ను ఖల్లాస్ చేశారని ఆమె విమర్శించారు. హైదరాబాద్ లో పెద్ద భవంతుల నిర్మాణం జరిగిందంటే అందులో కేసీఆర్ కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్లేనని, వందల ఫ్లోర్లకు అనుమతి ఇచ్చి భాగస్వామ్యం తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, చాలా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదన్నారు.
వర్షాలకు ఉన్న రోడ్లు కూడా ధ్వంసమయ్యాయని, హైవే రోడ్ల మీదనే గుంతలతో ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జంపన్న వాగులో 8 మంది మృతదేహాలు లభ్యమైన పరిస్థితి కలిచివేసిందని, వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే బావ బామ్మర్దులు ఇద్దరూ ఎన్నికల కసరత్తులో బిజీగా ఉన్నారని ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని, కేసీఆర్ వద్ద ఉన్న బస్సు దేనికి.. ప్రజల కోసం తీరిగేందుకు కాదా? కేవలం ఎన్నికల సమయంలో తిరిగేందుకేనా? ప్రజల కోసం కాకుంటే హెలికాప్టర్, బస్సులు కొనడం దేనికి? అని ఆమె ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, సర్వం కోల్పోయిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని, కేబినెట్ పెట్టేది కూడా వర్షాల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కాదు.. ఎన్నికల్లో ప్రజలను మరోసారి ఎలా మోసం చేయాలనే నిర్వహిస్తున్నారన్నారు. నీట మునిగిన ప్రాంతాల పరిశీలనలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బూర నర్సయ్య గౌడ్ ను బీఆరెస్ నేతలు అడ్డుకున్నారన్నారు. బీఆరెస్ నేతలు సహాయం చేయరు.. చేసే వారిని కూడా చేయనివ్వరన్నారు.