తొలకరి వర్షాలు కురిశాయంటే చాలు.. రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలో రైతులు, ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. ఈ సీజన్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో అని ఆశగా వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ సీజన్లో వజ్రాలు దొరికే అనంతపురం, కర్నూలు జిల్లాలలో ప్రజలు చాలా మంది పిల్లాపాపలతో వజ్రాల కోసం అన్వేషణ పెడతారు. ఈ రెండు జిల్లాల నుండే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుండి, వైయస్ఆర్ జిల్లా, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా వాహనాలలో వచ్చి ఇక్కడ వజ్రాన్వేషణలో చాలా మంది పాల్గొంటారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు. ఇదంతా తెలిసిన విషయమే.
Also Read : Joe Biden: ప్రిగోజిన్ మృతిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఆశ్చర్యమేమీ లేదని వ్యాఖ్య
అయితే.. తాజాగా ఓ పుకారు ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామస్థులను వజ్రాల వేట కోసం ఎగబడేలా చేసింది. ఓ వ్యక్తి వజ్రం దొరికిందని అది కూడా.. తమ గ్రామంలోని ఓ ప్రాంతంలో దొరికిందని చెప్పడంతో.. గ్రామస్థులంతా అక్కడే వజ్రాల కోసం జల్లెడ పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో తర్లుపాడు మండలంలో వజ్రాల వేట జోరుగా సాగుతోంది. గానుగపెంటలోని నల్లకొండ, చెన్నరాయుని నరవ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. కొండ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు స్థానికులు, మహిళలు. గత వారం రోజులుగా వజ్రాల వేట కొనసాగుతోంది. బుడ్డపల్లికి చెందిన ఓ వ్యక్తికి ఆ ప్రాంతంలో వజ్రం దొరికిందని పుకార్లు రావడంతో ఇదంతా చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రతీ రాయిని పరిశీలిస్తున్నారు. అయితే.. వజ్రాల వేటకు వచ్చే వారితో కొండ ప్రాంతం సందడిగా మారింది. కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను చూసి కొందరు స్థానికులు జారుకున్నారు.
Also Read : Virat Kohli Yo Yo Test: యో-యో టెస్టు పాసైన విరాట్ కోహ్లీ.. సంతోషం పట్టలేక..!