Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan

Dharmendra Pradhan

Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అంశంపై సీనియర్ బీజేపీ నాయకుడు, సంబల్‌పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు నోరు విప్పారు. నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో జరిగిన నిరసనల సందర్భంగా ‘జెన్-జెడ్’ (Gen-Z) యువతను కొందరు తప్పుదోవ పట్టించారని, ఆ పరిణామాల వల్లే తాను పదవిని వీడాల్సి వచ్చిందని శనివారం వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో జూలై 25న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత దాదాపు రెండు వారాలకు జీఎం యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన తొలిసారిగా ఈ బహిరంగ ప్రకటన చేశారు.

జెన్-జెడ్ యువత మన పిల్లలలాంటి వారని, కొందరు వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రధాన్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఏటా కనీసం రెండు కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారని, గత పదేళ్లలో 20 కోట్ల మంది పురుడు పోసుకున్నాని పేర్కొన్నారు. వారి అంచనాలు, ఆకాంక్షలు వేరని, రాబోయే రోజుల్లో వారే భారత్‌ను విశ్వగురుగా నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు పదవి ముఖ్యం కాదని, అందుకే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాజీనామా సమర్పించినట్లు వివరించారు.

మరొక సభలో మాట్లాడుతూ.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్‌పై ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేడీ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు, ‘ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్’ నినాదాలకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు వద్ద బీజేడీ యువజన విభాగం చేసిన ఆందోళనలను ప్రస్తావిస్తూ.. తాను ఒక రైతు బిడ్డనని, వెనక్కి పొమ్మన్నా మళ్లీ వస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. నవీన్ పట్నాయక్ యువతను రెచ్చగొట్టి తనపైకి పంపుతున్నారని, తనను ఒడిశా ప్రజలకు ఒక అవమానంగా, చెడు వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తాను ఎప్పుడైనా ఒడిశా ప్రజలు తలదించుకునే పని చేశానా అని సభను ప్రశ్నించగా, ప్రజల నుంచి లేదని పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రాష్ట్రానికి పెద్దగా గౌరవం తేలేకపోయినా, తన ప్రవర్తనతో ఎప్పుడూ ఒడిశా ప్రతిష్టను దిగజార్చలేదని ప్రధాన్ స్పష్టం చేశారు. పన్నెండేళ్ల క్రితం జగన్నాథ స్వామి, సంబల్‌పూర్ ఆరాధ్య దైవం మా సమలేశ్వరి దేవి ఆశీస్సులతోనే తాను కేంద్ర మంత్రిని అయ్యానని గుర్తు చేసుకున్నారు. విచిత్రమేమిటంటే.. బీజేడీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ లీడర్ ప్రసన్న ఆచార్య సమక్షంలోనే ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.