Dhananjaya de Silva New Test Captain for Sri Lanka: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డిసిల్వాను నియమించింది. ఈ విషయాన్ని చీఫ్ సెలక్టర్ ఉపుల్ తరంగ ఓ ప్రకటనలో తెలిపాడు. దిముత్ కరుణరత్నె స్థానంలో ధనంజయ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ దసున్ శనకను తప్పించిన ఎస్‌ఎల్‌సీ.. వన్డేల బాధ్యతలు కుశాల్ మెండిస్‌కు, టీ20 పగ్గాలు వనిందు హసరంగకు అప్పగించిన విషయం తెలిసిందే.
ధనంజయ డిసిల్వా శ్రీలంకకు 18వ టెస్టు కెప్టెన్. డిసిల్వా ఇంటి పేరుతో ఇప్పటికే సోమచంద్ర మరియు అరవిందలు లంక జట్టుకు సారథ్యం వహించారు. దిముత్ కరుణరత్నే 2019 నుంచి 2023 వరకు శ్రీలంకకు నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా తన మొదటి సిరీస్‌లో (2018/19) కరుణరత్నే దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న తొలి ఆసియా సారథిగా రికార్డు నెలకొల్పాడు. లంకను 30 టెస్టులలో (12 విజయాలు, 12 ఓటములు, ఆరు డ్రాలు) నడిపించిన కరుణరత్నే.. ఇక నుంచి కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడు. ప్రతి ఫార్మాట్‌కు ప్రత్యేక కెప్టెన్‌తో 2024లో శ్రీలంక ఆడనుంది.
Also Read: Mohammed Siraj: రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేస్తామని అనుకోలేదు: సిరాజ్
ధనంజయ డిసిల్వా ఇప్పటివరకూ శ్రీలంక తరఫున 51 టెస్టులు ఆడి 39.77 సగటుతో 3,301 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 34 అర్థ సెంచరీలు ఉన్నాయి. ధనంజయకు తొలి సవాల్ ఫిబ్రవరిలో ఎదురుకాబోతుంది. ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో లంక టెస్టు ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఇక జనవరి 6 నుంచి జింబాబ్వేతో శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది.