Pakistan : ఎనిమిది నెలల క్రితం తమతో శృంగారానికి నిరాకరించినందుకు ఓ మహిళ ముక్కు కోసిన నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. డీజీ ఖాన్ జిల్లాలోని షా సదర్దీన్ ప్రాంతంలో జరిగిన ఈ భయానక ఘటనను దుండగుడు వీడియో కూడా తీశాడు. ప్రధాన అనుమానితుడు జాఫర్ లాషారీ, మరో ముగ్గురు తమతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సాల్మీ అనే మహిళను బలవంతం చేస్తున్నట్లు.. అందుకు ఆమె నిరాకరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
దీంతో ఆగ్రహించిన నిందితుడు కత్తితో మహిళ ముక్కును కోసి ఆ దృశ్యాన్ని మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. వీడియో క్లిప్‌లో అనుమానితుడు మహిళ ముక్కును కత్తిరించినట్లు కనిపిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు నమోదు చేయలేదనే సాకుతో నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఈ సంఘటనను గుర్తించింది. డీజీ ఖాన్ జిల్లా పోలీసు అధికారి (DPO) సయ్యద్ అలీ నుండి నివేదికను కోరింది. అనుమానితులైన జాఫర్ లాషారి, సఫ్దార్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేయాలని డిపిఓ ఆదేశించారు.
దీని ప్రకారం, బాధితురాలి సోదరి సహారన్ బీబీ ఫిర్యాదు మేరకు షా సదర్దిన్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి, పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 334, 511, 354 కింద కేసు నమోదు చేశారు. అమానవీయ చర్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీపీఓ ధృవీకరించారు.