Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి షాక్ తగిలింది.. జీడినెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామికి వ్యతిరేకంగా డైరెక్ట్ వార్‌కు దిగారు సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారుడు జ్ఞానేంద్రరెడ్డి.. గత ఎన్నికల్లో నారాయణస్వామిని గెలిపించడానికి అందరూ తమ వంతు ప్రయత్నం చేసి ఎమ్మెల్యేగా గెలిపించారన్న ఆయన.. మా పార్టీలో పెనుమూరు మండలంలోనే కాదు ఆరు మండలాలలో వర్గవిభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.. అయన డిప్యూటీ సీఎం అయినా.. సీఎం అయినా.. ఆయన మాకు మాత్రం ఎమ్మెల్యే.. ఆయన అందరిని కలుపుకొని పోవాలని సూచించారు.. అంతేకాదు.. 2024 ఎన్నికల్లో అయనకు సీటు కేటాయిస్తే మద్దతు ఇవ్వాలా ? వద్దా ? అనే విషయాన్ని ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామంటూ బాంబు పేల్చారు జ్ఞానేంద్రరెడ్డి.. ఇది ఏపీ రాజకీయాల్లో చర్చగా మారగా.. జ్ఞానేంద్రరెడ్డి వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
Read Also: Astrology : ఏప్రిల్ 13, గురువారం దినఫలాలు
తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. జ్ఞానేంద్రరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉన్నాను.. దళితుడిననే కదా నన్ను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. తాను తప్పు చేయను.. తప్పుచేస్తే కాళ్లమీద పడతాను అన్నారు.. తాను పుట్టినప్పటి నుంచి పెత్తందార్లకు వ్యతిరేకినని.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తానన్నారు.. అయితే, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డిలా తాను పార్టీలు మారలేదని, అమెరికా, బెంగళూరుల్లో వ్యాపారాలు చేసుకుంటూ.. మిగిలిన సమయంలో నియోజకవర్గంలో తిరగడం లేదు అని సెటైర్లు వేశారు. నామీద ఆయనకు ఎందుకింత కక్ష? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన ఇంట్లోవాళ్లందరికీ పదవులు ఇస్తేనే పార్టీలో అందరినీ కలుపుకుని పోయినట్లా? లేకపోతే లేదా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.