బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన కులగణన సమావేశంలో ఆయన పలు అంశాలపై బీసీ మేధావులతో, అధికారులతో చర్చించి మాట్లాడారు.
‘‘దేశ సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉంది. ఎక్కువమంది ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఈ అంతరాలు తొలగి పోవాలంటే కులగణన జరగాల్సిందే. కులగణనకు సంబంధించి వివిధ రాష్ట్రాలతో పాటు బీహార్‌లో ఎటువంటి న్యాయపర చిక్కులు లేకుండా, విజయవంతంగా సర్వే జరిగి చట్టరూపం దాల్చిన తీరును ఆయన అధికారులు అడిగి తెలుసుకున్నారు. కులగణనకు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కుల గణన చేపడుతామని దేశానికి ఆదర్శంగా నిలుస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు’’ అని డిప్యూటీ సీఎం బీసీ నేతలకు వివరించారు.
పొన్నం..
అసెంబ్లీలో కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఒక ఘట్ట౦ ముగిసిందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మేం నిజాయితీగా ఉన్నామని.. క్యాబినెట్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కులగణన తీర్మానాన్ని ఆమోదించామన్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ డిమాండ్‌లో పెట్టామని మంత్రి తెలిపారు.
కులగణన తీర్మానం చారిత్రాత్మకం.. దీన్ని స్వాగతిస్తున్నట్లు బీసీ మేధావులు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంతో మరో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.