Bhatti Vikramarka : రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశం, నిత్యవసరం కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అన్నారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ రీతిలో సన్నద్ధంగా ఉన్నారు, వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలి అన్నారు.
విద్యుత్ శాఖలో లైన్మెన్ మొదలు విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబంలో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పై అధికారికి ఫోన్ చేయాలని వారు స్పందించని పక్షంలో ఆపై అధికారికి అలా నాకు కూడా ఫోన్ చేయవచ్చని సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. మీకు క్షేత్రస్థాయిలో కావలసిన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం, ఏదైనా అడగవచ్చని అధికారులకు డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కోరిన అన్ని అనుమతులు ఇచ్చాం, మార్చి మొదటి తేదీ నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం ఇతర పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. గత మూడు సంవత్సరాలుగా సబ్ స్టేషన్ లపై పెరుగుతున్న లోడ్ భారం వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు.
బాగా పని చేసే వారికి ప్రోత్సాహకంగా అవార్డులు సైతం ఇచ్చే కార్యక్రమాన్ని విద్యుత్ శాఖలో ప్రారంభించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. మొన్నటి భారీ వరదల సమయంలో అర్ధరాత్రి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అటువంటివారిని గుర్తించాలని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం కోరారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి ఈ రంగంలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై సిబ్బందికి అవగాహన అవసరమని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన డయల్ 1912 కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి వినియోగదారునికి తెలిసేలా వారి మొబైల్ నెంబర్ కు 1912 ఎస్ఎంఎస్ చేయాలని, కరెంటు బిల్లు పైన సైతం 1912 సేవల గురించి ప్రచురించాలని ఆదేశించారు. ఈ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సిబ్బంది సంఖ్య పెంచడం, సాంకేతికంగా అదనపు హంగులు కల్పించేందుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్టోర్స్ లో అందుబాటులో ఉన్న సామాగ్రి, రాబోయే రోజుల్లో డిమాండ్కు తగిన విధంగా చేసుకుంటున్న ఏర్పాట్లపై వివిధ విభాగాల్లో ఉన్న సీఈలతో ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం సమీక్ష చేశారు. గత ఏడాదికి వస్తున్న సమస్యల్లో తేడాలు, ఫిర్యాదులు తగ్గడానికి చేపట్టిన చర్యలను అధికారుల ద్వారా డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు.