Brij Bhushan Sharan Singh: చెప్పినట్టు వింటేనే కెరీర్ ఉంటుంది. లైగింక వేధంపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్ల కేసు కొత్త మలుపు తిరిగింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ద్వారా పలు సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. మహిళా రెజ్లర్లను ఆయన లైంగికంగా వేధించారని, ఛాతిపై చేతులు వేయడం, శరీర భాగాలను తాకడం, గదిలోకి పిలిచి అసభ్యంగా మాట్లాడడం వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడ్డారని.. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లలో వెల్లడైంది. గాయపడిన రెజ్లర్‌ను అయితే.. తన కోరిక తీరుస్తానంటే చికిత్సకయ్యే ఖర్చంతా ఫెడరేషన్ భరిస్తుందని చెప్పినటు్ట ఫిర్యాదు అందింది. బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత రెజ్లర్లు కొన్ని రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు. గత నెల ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆరుగురు రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదు మేరకు మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆరుగురు రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదులో డబ్ల్యూఎఫ్‌ఐ కార్యదర్శి వినోద్ తోమర్ పేరు ఉంది. ఇదిలా ఉండగా, బ్రిజ్‌భూషణ్ ఈ నెల 5న ఉత్తరప్రదేశ్‌లో ‘జన చేతన మహార్యాలీ’ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో… భద్రతా కారణాలతో అధికారులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో అయోధ్యలో నిర్వహించాలనుకొన్న ‘జన చేతన్ మహా ర్యాలీ’ని వాయిదా వేస్తున్నట్టు ఎంపీ బ్రిజ్‌భూషణ్ ప్రకటించారు.
Read Also: AP CM Jagan: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష
ప్రధాని రక్షణలో ఎంపీ సేఫ్: రాహుల్ గాంధీ
అంతర్జాతీయ పతకాలు సాధించిన మన కుమార్తెలు ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాడుతుంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ ప్రధాని మోదీ రక్షణ కవచం కింద సురక్షితంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రధానిని ప్రశ్నించారు.
తొందర పడొద్దు: కపిల్ జట్టు
పతకాలు గంగలో పడేస్తామన్న రెజ్లర్లకు 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టు సభ్యులు ఓ విన్నపం చేశారు. ‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదని, వాటిలో ఈ దేశ ప్రతిష్ఠ కూడా ఇమిడి ఉందన్నారు. ఈ నిర్ణయం విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దని హితవు పలికారు.
9లోగా అరెస్టు చేయండి: బీకేయూ
బ్రిజ్‌భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) డిమాండ్ చేసింది. లేదంటే, రెజ్లర్లతో సహా జంతర్ మంతర్ వద్ద తాము కూడా దీక్షకు కూర్చొని దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
భరోసా ఇచ్చి మోసగించారు..
బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపుల గురించి 2021లోనే రెజ్లర్లు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు ఎఫ్‌ఐఆర్ కాపీలను బట్టి తెలుస్తున్నది. మోదీని కలిసినప్పుడు ఈ విషయాలను ఆయనకు వివరించామని, క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఫిర్యాదులపై తగిన విధంగా స్పందిస్తుందని ఆయన తమతో చెప్పి భరోసా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో ఓ రెజ్లర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, సమస్య పరిష్కారమవ్వలేదని ఆమె వాపోయారు.