MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఈనెల 15 ఉదయం గం. 10.00 వరకు కవితకు సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆమెను ఈడీ పలు ప్రశ్నలపై విచారించగా.. సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది. ఇదిలా ఉండగా.. కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు సోదరులు కేటీఆర్, సంతోష్, భర్త అనిల్, కవిత పిల్లలు, తల్లి, పీఏ కలిసేందుకు అనుమతిని కూడా కోర్టు ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.
Read Also: Ponnam Prabhakar: ఏప్రిల్ 14న దీక్షకు దిగనున్న తెలంగాణ మంత్రి.. ఎందుకంటే?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఐదు రోజులు కస్టడీకి సీబీఐ కోరగా.. కోర్టు మూడు రోజు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారిగా సీబీఐ తెలిపింది. విజయ్ నాయర్, తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిగాయని, కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని పేర్కొంది. ఇక ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 ముడుపులు ఇచ్చినట్లుగా గుర్తించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు (రూ.15 కోట్లు ఒకసారి, రూ10 కోట్లు ఒకసారి) అందజేశారు. ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు. వాట్సాప్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సీబీఐ కోర్టుకు సమర్పించింది.
Read Also: Telangana: రంజాన్ తోఫా పంపిణీ.. ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సీఈసీ
ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం సీబీఐకి కూడా విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా సీబీఐ కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. సీబీఐ కూడా ఐదు రోజులు కస్టడీ కోరగా.. మూడు రోజుల అనుమతి లభించింది.