Delhi Capitals Players Reach Vizag for IPL 2924: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సొంత మైదానాల్లో సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ కాపిటల్స్ టీమ్ సభ్యులు కొందరు సోమవారం విశాఖకు చేరుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు.. రోడ్డు మార్గాన రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కి వెళ్లారు. డీసీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలి, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా మరికొందరు ప్లేయర్స్ విశాఖకు చేరుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ టీం సభ్యులు చాలామంది ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ సహా మరికొందరు ప్లేయర్స్ జట్టుతో కలవనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్లేయర్స్ వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈసారి ఐపీఎల్ మ్యాచులకు విశాఖ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ స్టేడియం ఢిల్లీ జట్టుకు హోమ్ గ్రౌండ్‌గా ఉంది. ఈ సీజన్‌లో తొలి విడతలో 21 మ్యాచ్‌లు 10 నగరాల్లో జరగనుండగా.. అందులో రెండు మ్యాచ్‌లు విశాఖలోనే షెడ్యూల్ చేయబడ్డాయి.
Also Read: Suicide Attempt in Flight: విమానంలో ప్రయాణికుడి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియం అన్న విషయం తెలిసిందే. ఈ మైదానంలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 సెకెండ్ ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో.. డీసీ యాజమాన్యం, బీసీసీఐ సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ రెండు హోం గేమ్స్‌ను విశాఖలో ఆడనుంది. మార్చి 31న చెన్నైతో, ఏప్రిల్ 3న కేకేఆర్‌తో విశాఖలో ఢిల్లీ ఆడనుంది. ఇక రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన 5 హోం గేమ్స్‌ను సొంత మైదానంలోనే ఆడుతుంది. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.