Koti Deepotsavam 2024 Day 10: భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కాగా.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి.. కాశీ విశ్వేశ్వరుడికి హారతి సమర్పించారు. కేంద్ర మంత్రుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
“దీపం ఐక్యతకు చిహ్నం.. ఆ ఐక్యతే మనకు బలం.. మనలో ఆ ఐక్యత కొనసాగాలని ఆశిస్తూ.. అలాగే ఈ కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది.. ఇటువంటి దీపోత్సవాల ద్వారా ప్రతి ఇల్లు ఒక ఇల్లు దేవాలయం కావాలి.. జ్ఞానసంపదకు క్షేత్రం కావాలి” అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్అన్నారు. రక్షణ మంత్రిగా దేశ సరిహద్దులు కాపాడటం నా బాధ్యత అన్న రాజ్‌నాథ్ సింగ్.. దేశ సరిహద్దును కాపాడటం ఎంత అవసరమో.. దేశంలో సంస్కృతిని కాపాడటం కూడా అంతే అవసరమన్నారు. ఆ పనిని ‘భక్తి’ టీవీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కోటి దీపోత్సవం దేశంలోనే ఒక భవ్య మహోత్సవమని అన్నారు. కోటి దీపోత్సవం వల్ల ఈ భారతదేశం ప్రకాశమంతమవుతుందన్నారు. తాను ఎక్కడా ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని చూడలేదన్నారు.
నేడు కార్తీక మూడో సోమవారం సందర్భంగా కోటి దీపోత్సవంలో జరిగే ఈ విశేష కార్యక్రమాలు జరిగాయి. శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ, శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనామృతం వినిపించారు. వేదికపై కాశీ జ్యోతిర్లింగ మహాపూజ జరిగింది. భక్తులచే శివలింగాలకు కోటి పుష్పార్చన జరిగింది. కాశీ శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నంది వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. చివరలో సప్త హారతి, లింగోద్భవం, మహానీరాజనంతో పదో రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవంతంగా ముగిసింది.