Balakrishna vs Deepika: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బాలయ్య తన నియోజకవర్గంలో పర్యటిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా.. ఆయనకు పోటీగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేశారు.. వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అంతే కాదు.. ఈ రోజు హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని.. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలకు ఒకే చోట గతంలో ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదన్నారు.
Read Also: Nagarjuna: అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ… ‘నా సామిరంగ’ ఈ రోజే!
ఇక, కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ ను ఖచ్చితంగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టిక్కెట్ల కేటాయింపులో ఉన్న కొంత అసంతృప్తిని త్వరలోనే అధిగమిస్తాం అన్నారు. టీడీపీ – జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ తప్ప ఆ పార్టీలో పోటీ చేసే వారు ఎవరు ఉన్నారు? అని ప్రశ్నించారు. మరోవైపు.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది.. ఓట్లు చీలేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. ఈ కుట్రలు అధిగమిస్తాం అన్నారు. ఎన్నికల్లో సచివాలయ సిబ్బందిని ఉపయోగించటం లేదు అని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అవగాహన లేక ఈసీకి ఫిర్యాదు చేశారని సెటైర్లు వేశారు. నిజమైన రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడే అంటూ మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.