ఎవరైనా , ఎక్కడైనా .. మనం మన పేరు చెప్పగానే మీదేం ఊరు అని అడగటం పరిపాటి. ఆ ప్రాంతంలో ఊరు పేరును బట్టి నేపధ్యాన్ని అంచనా వేస్తారు. నేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వందలాది కొత్త గ్రామాలు , కాలనీలు వెలుస్తున్నాయి. చారిత్రక ప్రదేశాలు , పాపులర్ పట్టణాలు తప్ప గ్రామాల పేర్లను గుర్తుంచుకోవడం చాలా కష్టంగా మారింది. కాని కొన్ని ఊరి పేర్లు విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఓ గ్రామం పేరే దీపావళి . అవును మీరు విన్నది నిజం. దీపావళి పండగ పేరుతోనే ఉంది ఆగ్రామం. అది ఎక్కడ ఏంటో తెలుసా?
శ్రీకాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామం పేరు చుట్టూ మూడు జిల్లాల వారు మరచిపోరు. ఎందుకంటే ఆగ్రామానికి అలాంటి విచిత్రమైన పేరు ఉంది. అదే శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామం. శ్రీకాకుళం పట్టణానికి కూత వేటు దూరంలో అరసవిల్లి శ్రీ సూర్యక్షేత్రానికి , శ్రీ కూర్మం కూర్మనాథ దేవాలయం పరిసరాల్లో ఉంది ఈ చారిత్రక నేపథ్యం వున్న గ్రామం. శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో ఈ ప్రాంతాన్ని సామంత రాజులు పాలించేవారు.శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగరాజు ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు స్థానికులు చెబుతుంటారు.
ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వ కాలంలో శ్రీకాకుళంను పాలించిన కళింగరాజు ఒక రోజు కళింగపట్నం వెళుతూ ఎండ తీవ్రత ఎక్కువై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడి పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు రాజును గుర్తించి సపర్యలు చేశారట. దాంతో ఆయన వెంటనే కోలుకుని, తనను కాపాడిన కూలీలకు రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజంతా గ్రామంలోనే ఉన్న రాజుగారు దీపావళి రోజు కావటంతో గ్రామస్తులతో కలిసి దీపావళి పండగ జరుపుకున్నారు. అదే సందర్బంలో రాజుగారు ఆ గ్రామానికి దీపావళి అనే నామకరణం చేశారని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఇక అప్పటి నుంచి ఇప్పటికీ రెవెన్యూ రికార్డులలో ఆ గ్రామం పేరు దీపావళి గానే నిలిచిపోయింది.
Read Also: Sundar Pichai: పాక్ అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్.. దెబ్బ అదుర్స్ కదూ!
ఇక ఈ గ్రామం పేరును కొత్తగా విన్నవారు భలేగా ఉంది అంటూ ఆశ్చర్యానికి లోనౌతుంటారు. కొద్ది మంది దీపావళి అనే పేరు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తుంటారట. ఒక్కసారి తాము తమ గ్రామం పేరు చెబితే మరో సారి ఎవరికీ గుర్తు చేయాల్సిన పనిలేదని అంతలా మెదళ్ళలో నాటుకు పోతుందని చెబుతున్నారు. దీపావళి పండగ చాలా ఫ్యామస్.. అలాగే తమ గ్రామం కూడా అంతే పాపులారిటీ సాధించింది అంటున్నారు. దీపావళి గ్రామస్తులు మాత్రం పండగ పేరు తమ గ్రామానికి ఉండటంతో హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. దీపావళి అంటే అందరికీ పండగ అని మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ అక్కడి ప్రజలకు మాత్రం తమ ఊరు గుర్తుకు వస్తుంది.
హిందువుల ముఖ్యమైన పండగల్లో ఒకటైన దీపావళి తో తమ గ్రామం పేరు ఉండటం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్తులు. దీపావళి పండగను గ్రామస్తులంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. మరో విషయం ఏమిటంటే..అందరూ సంక్రాంతికి చేసే పూర్వీకులకు పిండ ప్రధానం దీపావళి రోజున చేయటం ఈ గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని దీపావళి గ్రామం పేరు తెలియని వారు ఉండరు. తమ గ్రామం పేరును పదమంది మెచ్చుకోవడం ఆనందం ఉందంటున్నారు. పచ్చటి పల్లె వాతావరణంలో ఉండే ఈ దీపావళిని గ్రామమంతా దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటుండటం ఆనవాయితీగా వస్తుంది.
Read Also: Talari Venkat Rao: ఏజెన్సీవాసులకు గుడ్ న్యూస్ ..సత్యసాయిబాబా నీటిపథకం షురూ