అశుతోష్ శర్మ చేతి వేలు కట్ అయినా మ్యాచ్ ఆడాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ తెలిపారు. గాయం అయినా మ్యాచ్‌ను తనదైన స్టైల్‌లో ముగించాడని ప్రశంసించారు. ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒక వికెట్ తేడాతో గెలిచింది. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్న ఢిల్లీని అశుతోష్ మెరుపు హాఫ్ సెంచరీ (66; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో విజయతీరాలకు చేర్చాడు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’కు సరైన న్యాయం చేశాడు.
Also Read: Uttar Pradesh: ఉదయం ప్రియురాలు, సాయంత్రం మరో మహిళ.. ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి..
మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ మాట్లాడుతూ… ‘అశుతోష్ శర్మ చేతి వేలు కట్ అయింది. అశుతోష్ లక్నో మ్యాచ్‌లో ఆడాలనుకున్నా. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు నేను అతడితో చాట్ చేశా. వేలు తెగింది కదా ఎలా ఆడతావు? అని అడిగా. నేను మ్యాచ్ ఆడుతాను, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాను అని చెప్పాడు. అశుతోష్ ఓ దశలో 15 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అనంతరం చెలరేగి ఆడి 31 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మ్యాచ్‌ను తనదైన స్టైల్‌లో ముగించాడు’ అని తెలిపారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.