స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో పోటీ కారణంగానే తాను ఆటను మరింత ఆస్వాదించానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తెలిపారు. రఫాది గొప్ప ప్రయాణం అని, 14 ఫ్రెంచ్ ఓపెన్‌లు గెలవడం చరిత్రాత్మకం అని ప్రసశంసించారు. స్పెయిన్ సహా మొత్తం టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావని ఫెదరర్ పేర్కొన్నారు. డేవిస్‌కప్ తన కెరీర్‌లో చివరి టోర్నీ ప్రకటించిన నాదల్.. మంగళవారం తీవ్ర భావోద్వేగాల మధ్య బరిలోకి దిగాడు. క్వార్టర్ ఫైనల్స్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఫెదరర్ ఓ భావోద్వేగ లేఖ రాశాడు.
‘రఫా.. నువ్వు నన్ను ఎన్నో సార్లు ఓడించావ్. నేను నిన్ను ఓడించిన దానికన్నా ఎక్కువగా నన్ను ఓడించావు. నీ అంతగా మరెవరూ నాకు సవాలు విసరలేదు. మట్టి కోర్టులో ఆడుతున్నప్పుడు నీ అడ్డాలో ఆడుతున్నట్లు ఉండేది. నేను ఊహించని దాని కన్నా ఎక్కువగా కష్టపడేలా చేశావు. నా రాకెట్ హెడ్ పరిమాణాన్ని మార్చేలా చేశావు. నేను ఆటను మరింతగా ఆస్వాదించేలా నువ్వే చేశావు. నీది గొప్ప ప్రయాణం. 14 ఫ్రెంచ్ ఓపెన్‌లు గెలవడం ఓ చరిత్ర. నీ ఆటతో స్పెయిన్ మొత్తం గర్వపడేలా చేశావు. రఫా.. నువ్ టెన్నిస్ ప్రపంచం మొత్తం గర్వపడేలా చేశావు’ అని రోజర్ ఫెదరర్ లేఖలో పేర్కొన్నారు.
Also Read: AR Rahman Divorce: ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి: రెహమాన్ తనయుడు
‘నేను ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు.. నువ్వు నా భాగస్వామిగా నా పక్కనుండడం గొప్పగా అనిపించింది. ఆ రోజు నీతో కోర్టును, కన్నీళ్లనూ పంచుకోవడం నా కెరీర్‌లో మరిచిపోలేను. నీ కెరీర్‌లో ఆఖరి పోరుపై దృష్టి పెట్టావని తెలుసు. అది ముగిశాక మాట్లాడుకుందాం. నీ పాత స్నేహితుడు ఎల్లప్పుడూ నీ విజయాన్ని కోరుకుంటాడు’ అని ఫెదరర్ లేఖలో రాసుకొచ్చారు. నాదల్, ఫెదరర్‌లు ఆటలో ప్రత్యర్థులే అయినా.. ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. 22 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన నాదల్.. ‘క్లే కింగ్’గా పేరుగాంచిన విషయం తెలిసిందే.