David Warner announces retirement from ODI’s: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్.. వన్డే క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయన్నాడు. అయితే పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను అందుబాటులో ఉంటానని దేవ్ భాయ్ తెలిపాడు.
సోమవారం సిడ్నీ గ్రౌండ్‌లో డేవిడ్ వార్నర్ మీడియాతో మాట్లాడుతూ… ‘నేను వన్డే క్రికెట్ నుండి కూడా రిటైర్ అవుతున్నాను. వన్డే ప్రపంచకప్ గెలవడం, అందులోనూ భారతదేశంలో గెలుపొందడాన్ని ఓ భారీ విజయంగా భావిస్తున్నాను. ఈ తరుణమే వన్డేలకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నా. నా నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయి. టెస్టు, వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందని తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నా. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరం అయితే అందుబాటులో ఉంటా’ అని తెలిపాడు.
Also Read: PSLV-C58 Launch: నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58!
ఈవారం పాకిస్థాన్‌తో జరగనున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో చివరిది. 2009 జనవరి 18న హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున వన్డే అరంగేట్రం చేసాడు. చివరి వన్డే మ్యాచ్ 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆడాడు. ఆసీస్ తరపున 161 వన్డేలు ఆడిన వార్నర్.. 6,932 పరుగులు చేశాడు. 2015 మరియు 2023లో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో 345 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో 647 పరుగులు చేసిన వార్నర్.. 2023 వన్డే ప్రపంచకప్‌లో 528 పరుగులు చేశాడు.