Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచుంగ్ కోస్తా ఆంధ్ర దిశగా దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కొనసాగుతుంది. అలాగే బాపట్లకు ఆగ్నేయ దిశలో 300 కిలోమీటర్ల దూరంలో… మచిలీపట్నానికి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలైన నెల్లూరు-మచిలీపట్టణానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ వల్ల దివిసీమకు ఉప్పెన ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడతాయంటున్నారు వాతావరణ నిపుణులు. తుఫాన్ ప్రభావం వల్ల కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావారణ శాఖ హెచ్చరించింది.
Read Also: Nani: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. నాని ఏమన్నాడంటే.. ?
మిచౌంగ్ తుఫాన్ సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు ఏపీ ముఖ్యమంత్రి YS జగన్. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారాయన. కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవాల్సి అవసరం ఉందన్నారు సీఎం జగన్. తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్లకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. తుఫాను సహాయక చర్యల్లో కలెక్టర్లకు సాయంగా ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను నియమిస్తున్నామన్నారు సీఎం జగన్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తానన్నారు సీఎం జగన్. ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అని అడుగుతానన్నారు. బాధితుల నుంచి అధికారుల పనితీరు బాలేదనే సమాధానం రాకూడదని స్పష్టం చేశారు జగన్. ప్రస్తుతం తెలంగాణ వైపు తూర్పు దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణకి ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ చేసింది ఐఎండీ. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండటంతో… 115 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. అటు ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా పని చేస్తున్న ఈస్ట్ కోస్టు రైల్వే కూడా 60 రైళ్లను రద్దు చేసింది.