నల్లగొండ జిల్లాలో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ టీచర్ ను సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురిచేశారు. బెంగుళూరులో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినావని అరెస్ట్ చేస్తున్నామని ఫోన్ చేశారు సైబర్ నిందితులు. అరెస్ట్ కావద్దు అంటే రూ.18 లక్షలు తమ ఎకౌంట్ లో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధిత రిటైర్డ్ టీచర్ రూ.18 లక్షలు సైబర్ నేరగాళ్ల ఎకౌంట్ లో డిపాజిట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. డబ్బు బదిలీ చేసేందుకు బాధితుడు బ్యాంకుకు వెళ్లాడు. ఖాతాదారుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అధించాడు బ్యాంక్ మేనేజర్.
రంగంలోకి దిగిన నల్లగొండ సైబర్ క్రైమ్ పోలీసులు డిజిటల్ అరెస్ట్ ఉండదని అవగాహన కల్పించి రూ.18 లక్షలు బదిలీ కాకుండా అడ్డుకుని బాధితుడిని కాపాడారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవగాహన పెంచుకుని సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని పోలీసులు సూచించారు. కాగా ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను అందినకాడికి దోచుకున్న ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చదువు లేని వారితో పాటు చదువుకున్న వ్యక్తులు సైతం సైబర్ నేరాల బారిన పడడం ఆందోళన కలిగిస్తుందంటున్నారు పలువురు వ్యక్తులు.