ఈనెల 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
CM Revanth: కోస్గి సభలో సీఎం కీలక ప్రకటన.. వారం రోజుల్లో ఆ పథకాలు
ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షలలో మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. మొత్తం 1521 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే ఈ పరీక్షా కేంద్రాలలోనికి ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్ లను తీసుకెళ్లడం నిషేదించినట్టు స్పష్టం చేశారు. పరీక్షా ప్రశ్నా పత్రాలను స్ట్రాంగ్ రూమ్ లకు లేదా మూల్యాంకన కేంద్రాలకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని తెలిపారు. ఏ విధమైన పరీక్షా పత్రాలు కూడా లీక్ అవ్వకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి పలు మార్లు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్ సూపరింటెండెంట్ లు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.
CM Revanth: మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్..
ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా, మార్చి 18 వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 వతేదీ వరకు జరుగుతాయని.. 5 లక్షల 8 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు 2676 కేంద్రాలలో హాజరవుతారని, ఈ పరీక్షలు కూడా పటిష్టంగా నిర్వహించాలని సీఎస్ స్పష్టం చేశారు. తగు పటిష్టమైన ఏర్పాట్లుతో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్.టి.సి బస్సులు తగు విధంగా అందుబాటులో ఉంచాలని సీఎస్ అధికారులకు సూచించారు.