రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినందున వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఇప్పటివరకు వరద బాధిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, జిల్లా యంత్రాగం మొత్తం చేసిన సమిష్టి కృషితో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారని అభినందించారు. మరో 24 గంటల పాటు ఇదే రకమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
Also Read : Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. ఐదు రోజులలో రెండోసారి
వర్షాల వల్ల ఏర్పడిన వరద తగ్గుముఖం పట్టినందున ఆయా ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిచాలని కలెక్టర్లను కోరారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో బాధితులకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, సరిపడా ఆహరం, మంచినీరును ఏర్పాటు చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సహాయ కార్యక్రమాలను అందించేందుకుగాను ఇప్పటికే సహకరిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడే కొనసాగించాలని స్పష్టం చేసారు భద్రాచలం, నిర్మల్ లలో రెండు బృందాలు చొప్పున, కొత్తగూడెం, ములుగు,వరంగల్, ఖమ్మం,భూపాలపల్లి, హైదరాబాద్ లలో ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలున్నాయని వివరించారు. పునరావాస కార్యక్రమాలకు ఏవిధమైన సహాయం కావాలన్న అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని
సీఎస్ స్పష్టం చేశారు.
Also Read : Top Headlines @9PM : టాప్ న్యూస్
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, జిల్లా పాలనా యంత్రాంగం సహాయ సహకారాలతో పలు జిల్లాల్లో దాదాపు 19 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని అన్నారు. పలు జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, సీనియర్ పోలీస్ అధికారులను పంపి పరిస్థితులను పర్యవేక్షించడం జరుగుతుందని వివరించారు. నీటిపారుదల శాఖ స్పెషల్ సి.ఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో తెగిన చెరువులు, కుంటలను పునరుద్దరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షపాతం కొన్ని జిల్లాల్లో కురిసినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రం చేసిన ఉమ్మడి కృషితో నష్టాన్ని తగ్గించగలిగామని అన్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస చర్యలపై కలెక్టర్లు వివరించారు.