Kishan Reddy: కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని టీ-హబ్‌లో నిర్వహించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM) ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సెమినార్‌లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. పరిశోధనలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు హైదరాబాద్ అనువైన నగరమని.. ఇది సృజనాత్మకతకు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు హబ్ లాంటిదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. 2030 నాటికి EV బ్యాటరీలకు, పునరుత్పాదక శక్తి సాంకేతికతకు డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుందని, దీనితో క్రిటికల్ మినరల్స్ అవసరం కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
NCMM కింద ఇప్పటికే దేశంలో 4 ఐఐటీలు, 3 రీసెర్చ్ ల్యాబొరేటరీలను “సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు” గా అభివృద్ధి చేశామని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి భారతదేశం ఆత్మనిర్భర్ దేశంగా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా గనుల రంగంలో సమూల మార్పులు వచ్చాయని కిషన్ రెడ్డి అన్నారు. చరిత్రలోనే తొలిసారిగా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 1 బిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేధించామని తెలిపారు. అలాగే, ఆఫ్ షోర్ మినరల్ బ్లాక్స్, ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్ బ్లాక్‌లకు సంబంధించి తొలిసారిగా వేలం ప్రక్రియ చేపట్టామని చెప్పారు.
Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయవద్దు.. ప్రైవేట్ ఆసుపత్రులకు విజ్ఞప్తి!
ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి 6వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని.. ఇందులో తెలంగాణతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తొలిసారిగా పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్‌ను ఉత్పత్తి చేయడానికి, రీసైక్లింగ్‌ను బలోపేతం చేయడానికి రూ. 1500 కోట్లతో ప్రారంభించిన కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, దీని వల్ల 70 వేల ఉద్యోగావకాశాలు కలుగుతాయని చెప్పారు.
మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలో సవరణలు చేయడం వల్ల లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి లోతైన ఖనిజాల తవ్వకం సాధ్యమైందని కిషన్ రెడ్డి వివరించారు. విదేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టేందుకు నిధుల కోసం నేషనల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్‌ను ఉపయోగిస్తున్నామని, ఇప్పటికే కాబిల్ (KABIL) అర్జెంటీనాలో లిథియం బ్లాకులను సొంతం చేసుకుని తవ్వకాలు ప్రారంభించిందని తెలిపారు. జపాన్, పెరూ వంటి దేశాలతో ఖనిజాల వెలికితీతకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని అన్నారు.
AP Free Bus Effect : “జనాల మధ్య మా ఊపిరి ఆగిపోయేలా ఉంది” కండక్టర్ కుసుమ కుమారి సెల్ఫీ వీడియో వైరల్!
లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’, అటల్ బిహారీ వాజ్‌పేయి ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదాలను గుర్తుచేస్తూ, ప్రధాని మోదీ ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ నినాదాన్ని ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. ఇది “వికసిత భారత్” సాధించే దిశగా పరిశోధనలు, సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడం, ఒకే మిషన్‌లో 103 ఉపగ్రహాలను ప్రయోగించడం వంటి విజయాలు సాధించామని, ఇలాంటి స్ఫూర్తితోనే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కృషి చేయాలని ఆయన కోరారు. చివరగా, ‘డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్’ ప్రారంభించి పదేళ్లు పూర్తైన సందర్భంగా గనుల కార్మికులకు, స్థానికులకు లబ్ధి చేకూర్చాలని, వారి గౌరవం, భద్రత కోసం బొగ్గు గనుల కార్మికులకు రూ. 1 కోటి వరకు బీమా కవరేజ్ అందిస్తున్నామని కిషన్ రెడ్డి తెలియజేశారు.