Crime News: రౌడీ షీటర్ మసిఉద్దీన్ హత్య కేసును రెయిన్ బజార్ పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగిన విష్యం తెలిసిందే. మసిఉద్దీన్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఈ కేసును పరిశీలించిన పోలీసులు అతి తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకుని కేసును సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇక ఈ కేసు ప్రాథమిక విచారణలో రంజాన్ పర్వదిన సమయంలో మసిఉద్దీన్‌తో నిందితుల మధ్య వివాదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి ద్వేషంతో పాటు భయంతోనూ నిందితులు అతన్ని హత్య చేయాలని తలపెట్టినట్లు సమాచారం. వివాదాల నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మసిఉద్దీన్ మళ్లీ తమపై దాడికి దిగుతాడోనని భయంతోనే అతన్ని ముందుగానే హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్యలో కీలకంగా ఉన్న మహమ్మద్ పాషా షేర్‌తో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తును కొనసాగిస్తున్నారు.