Supreme Court: కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్‌ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉచిత రేషన్‌కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ, దాదాపు 2 నుండి 3 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పథకం నుండి మిగిలిపోయారని న్యాయస్థానానికి వివరించారు. ఈ లెక్కలను బట్టి చూస్తే పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఈ స్కీమ్‌కు దూరంగా ఉన్నారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని, దీనికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు, కల్పించం, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇప్పటికే 81.35 కోట్ల మంది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ప్రయోజనాలు పొందుతున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా తెలిపారు. దీనిపై ఎన్జీవో తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, నిరుద్యోగం గణనీయంగా పెరిగినందున కరోనా మహమ్మారి కారణంగా పేద ప్రజల పరిస్థితి నిజంగా అధ్వాన్నంగా ఉందని అన్నారు. దీనిపై జస్టిస్ కాంత్ మౌఖికంగా వ్యాఖ్యానించారు, అప్పుడు ఉపాధి కల్పించడానికి ఏమి చేయాలో ఆలోచించాలన్నారు. 2020లో కరోనా కాలంలో మొదలైన వల కార్మికుల కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ శ్రమ్ పోర్టల్‌లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ సమకూర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో ధర్మాసనంపై స్పందిస్తూ.. ఇక ఎంతకాలం ఉచితాలు ఇవ్వాలని.. ఈ వలస కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ఎందుకు పని చేయకూడదని ప్రశ్నించింది. అనంతరం కోర్టు తదుపరి విచారణను జనవరి 8, 2025కు వాయిదా వేసింది.