Trolls on CAS Over Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)కు వినేశ్ అప్పీలు చేసింది. వినేశ్ లీగల్ టీమ్ కాస్ ఎదుట కీలక విషయాలను ప్రస్తావించారు. వాదనలు విన్న కాస్.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసింది. శుక్రవారం రాత్రి 9.30 గంటల్లోపు తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది.
Also Read: IND vs BAN: భారత్-బంగ్లా షెడ్యూల్‌లో మార్పు.. 14 ఏళ్ల తర్వాత అక్కడ అంతర్జాతీయ మ్యాచ్!
వినేశ్ ఫొగాట్ అప్పీలుపై మూడోసారి కాస్ తన తీర్పును వాయిదా వేయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కాస్ తన తీర్పును ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘వినేశ్ ఫొగాట్ అప్పీలుపై తీర్పును కాస్ మళ్లీ వాయిదా వేసింది. ఇది చూస్తుంటే సినిమాల్లోని కోర్టుల్లో రోజూ వాయిదా పడే సన్నివేశాలు గుర్తొస్తున్నాయి’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఇలా వాయిదా వేస్తూ పోతుంటే తీర్పు ఏమిచ్చినా ఎవరూ పట్టించుకోరని కాస్ భావిస్తోంది. వినేశ్ ఫొగాట్‌కు న్యాయం జరగాల్సిందే’, ‘వినేశ్‌కు రజతం ప్రకటించాల్సిందే. 100 గ్రాములు అసలు సమస్యే కాదు’ అని కామెంట్స్ చేస్తున్నారు.